ఖాళీ డాల్డా పాకెట్లు కరిగించి డ్రమ్ముల్లో నింపిన డాల్డా
అంబర్‌పేట: హోటళ్లు, బేకరీల్లో వాడిపడేసిన డాల్డా ప్యాకెట్ల వేడిచేసి... అందులో మిగిలి ఉన్న డాల్డాను సేకరించడం.. దానికి వేరే పదార్థాలు కలిపి నకిలీ డాల్డా తయారు చేసి విక్రయించడం.. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఓ తయారీ కేంద్రంపై జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం దాడి చేశారు. జీహెచ్‌ఎంసీ ఎఎంహెచ్‌ఓ డాక్టర్ హనుమంతారావు, స్థానికుల కథనం ప్రకారం...
మలక్‌పేట అఫ్జల్‌నగర్ నివాసి ఎండీ వశీం గోల్నాక తులసీనగర్ లంకబస్తీలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకున్నాడు. హోటళ్లు, బేకరీల్లో వినియోగించిపడేసిన డాల్డా ప్యాకెట్లను సేకరిస్తున్నాడు. వాటిని వేడి చేసి అందులో మిగిలి ఉన్న డాల్డాను డ్రమ్ముల్లో నింపి విక్రయిస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్లను కరిగించి ప్లాస్టిక్ వైర్లు తయారు చేస్తున్నాడు. కవర్లను కరిగిస్తున్న సమయంలో భరించలేని వాసన, విషవాయులు వెలువడుతుండటంతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో శనివారం సర్కిల్–9బి ఎఎంహెచ్‌ఓ హనుమంతారావు తన సిబ్బందితో వెళ్లి ఆ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ తయారవుతున్న డాల్డా శాంపిల్స్ సేకరించారు. వీటి పరీక్షల్లో వచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేంద్రానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకపోవడంతో రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు షెడ్‌ను సీజ్ చేశారు. నిర్వాహకులు మాత్రం తాము తయారు చేసేది డాల్డా కాదని, సబ్బుల తయారీకి అవసరమైన ముడిసరుకు మాత్రమేనని కొద్దిసేపు అధికారులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం.