నవంబర్ 14న దళిత క్రైస్తవ గర్జన
ఒంగోలు : నవంబర్ 14న దళిత క్రైస్తవ గర్జన రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలిపారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో అఖిల పక్షం బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రిని కలుస్తామన్నారు.
ఆల్ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జార్జి శ్రీమంతుల మాట్లాడుతూ ఎస్సీగా పుట్టిన వారు నచ్చిన దైవాన్ని కొలవాలనుకోవడం నేరమా అని ప్రశ్నించారు. బౌద్ధులకు, సిక్కులకు ఉన్న మత స్వేచ్ఛ ఎస్సీలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఫెడరేషన్ జాతీయ నాయకుడు గద్దపాటి విజయరాజు, నాగార్జున యూనివర్శిటీ సిండికేట్ సభ్యుడు టీఎస్ఎస్ సింగ్ మాస్టరు, రెవరెండ్లు కె. సామ్రాట్, బిషప్ జాకబ్ సామ్యూల్, పి. డేవిడ్, పి. విలియం కేరి, పి. అల్బర్ట్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు.