మైకు విరగ్గొట్టినందుకు.. కట్ చేశారు
న్యూఢిల్లీ: సభలో నానా రభస చేసి మైకు విరగ్గొట్టిన బీజేపీ ఎమ్మెల్యేకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మైకు విరగ్గొట్టిన ఓం ప్రకాశ్ శర్మ రూ.18,560 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం నాటి సభలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ చేయొద్దంటూ అందులో హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎమ్మెల్యే భవనా గౌర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా సభ్యులు దానిని ఆమోదించారు.
ఢిల్లీలో మొత్తం 70మంది సభ్యలు ఉండగా అందులో 67మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాగా, ఈ తీర్మానాన్ని విజేందర్ గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. 'ఉద్దేశపూర్వకంగా శర్మ ఆపనిచేయలేదు. ఎలాంటి నష్టం కలిగించలేదు' అని గుప్తా తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో విశ్వాస్ నగర్ ఎమ్మెల్యే అయిన శర్మను మొత్తం సెషన్ సభకు రానివ్వకుండా వేటు వేశారు. తమ పార్టీ నేత అల్కా లంబాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా శర్మపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.