సీమాంధ్రకు ప్రత్యేక హోదా... బీహార్‌లో 'ఆందోళనలు'
ఆంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంతో బీహార్‌లోని రాజకీయ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ బీహార్ రైలు రాకో నిర్వహించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే స్థానిక రైళ్లు కూడా ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని రైలురోకోకు నాయకత్వం వహించిన దినాపూర్ ఎమ్మెల్యే ఆశా సిన్హా మీడియాకు తెలిపారు.
కేంద్రం తమ డిమాండ్‌ను పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినప్పుడు బీహార్‌కు ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ఆశా ఈ సందర్బంగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే వరకు ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్‌పై కేంద్రం దిగివచ్చే విధంగా ఆందోళనలు ఉండాలని బీజేపీ నాయకుడు జనార్దన్ కుమార్ ఆందోళనకారులకు సూచించారు.
బంద్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తమ ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బీహార్ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తు అధికార జేడీ (ఎస్) పార్టీ అధినేత, సీఎం కిరణ్ మార్చి 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.