నిఘా అప్పగిస్తే ఉగ్రవాదిని పెళ్లిచేసుకుంది
వాషింగ్టన్: నిఘా కోసం నియమిస్తే ఆ విషయం మరిచిపోయి ఓ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది డానియెలా గ్రీనే అనే ఓ ఎఫ్‌బీఐ అధికారి. దీంతో అమెరికా ఎఫ్‌బీఐ ఉన్నతాధికారులు ఖిన్నులయ్యారు. ఎఫ్‌బీఐ అధికారులు మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ధ్రువపత్రాల ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమెకు అత్యంత రహస్య భద్రత కూడా ఉంది. ఈ పత్రాల ప్రకారం జూన్ 2014న జర్మనీలోని తన తల్లిదండ్రులను చూసేందుకు బయలుదేరి వెళ్లిన ఆమె అక్కడికి వెళ్లకుండా టర్కీకి వెళ్లింది. టర్కీ సరిహద్దు గుండా వెళ్లి తాను వివాహం చేసుకోవాలనుకున్న ఐసిస్ ఉగ్రవాదిని కలిసింది.
ఆ వెంటనే వివాహం చేసుకుంది. అయితే, అతడు ఎవరనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అక్కడి మీడియా వర్గాల సమాచారం ప్రకారం అతడు డెనిస్ కస్పెర్ట్ అని తెలిసింది. డెనిస్‌ను 2015లో ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. జర్మనీకి చెందిన ఐసిస్ ఉగ్రవాద గ్రూపుపై నిఘా నిర్వహించేందుకు ఎఫ్‌బీఐలో అనువాద విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ డానియెలాను నియమించారు. 2011లో అమెరికన్‌ను వివాహం చేసుకున్న ఆమె అనూహ్యంగా 2014లో మాయం అయింది. జూన్ నెలలో కనిపించకుండా పోయిన ఆమె అదే నెలలో ఉగ్రవాది డెనిస్‌ను వివాహం చేసుకుంది. అయితే, అది విషాదం అని తెలుసుకునేందుకు ఆమెకు ఎన్నో రోజులు పట్టలేదు. వెంటనే జూలై నెలలో తనకు తెలిసిన వ్యక్తికి తాను ఎంతో పెద్ద తప్పు చేశానని ఒక మెయిల్ పంపించింది. తన జీవితం ఎన్నిరోజులు ఇక్కడ మగ్గిపోతుందో తనకు అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ మరో మెయిల్ చేసింది.
యూఎస్ వస్తే తనను జీవితాంతం జైలులోనే ఉంచుతారని అయినా పర్వాలేదని పేర్కొంది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని ఆగస్టు నెలలో అమెరికాకు రాగా అక్కడే అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె నేరాన్ని ఒప్పుకుంది. జరిగిన విషయాలన్నీ ఒప్పుకొని పోలీసులకు పూర్తి సహకారం అందించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు చేరగా అవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. స్కైప్ ద్వారా ఉగ్రవాదితో ఆమెకు సంబంధాలు ఏర్పడినట్లు తెలిపింది. ఆమె అన్ని నిజాలు చెప్పడంతో రెండేళ్ల జైలు శిక్ష వేశారు.