dara sambaiah
-
నానాయాగి చేస్తున్న చంద్రబాబు
సాక్షి, చీమకుర్తి : రాష్ట్రంలోని పీడీఎఫ్ ఖాతాల్లో రూ.54 వేల కోట్లు శుభ్రంగా డ్రా చేసుకున్నారు. పట్టిసీమ పేరుతో రూ.1800 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక పోలవరం సంగతి సరేసరి. ఇలా రాష్ట్రంలోని నిధులను ఐదేళ్లపాటు అధికారకంగా మెక్కేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి నానాయాగీ చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టంగా వైఎస్సార్సీపీ తరఫున జగన్ సీఎం కావడం ఖాయమని తెలిసి పోయింది కాబట్టే చంద్రబాబు తన ఓటమిని జీర్ణించుకోలేక దేశంలోని పలు ప్రాంతాల్లో కాటికి కాళ్లుచాపిన నాయకులను కలుసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నకలను హుందాతనంగా స్వీకరించాలే తప్ప చంద్రబాబు ఓడిపోతుంటే తన స్థాయి తక్కువ చేసుకుని ప్రవర్తించటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చురకలు వేశారు. నాడు బాగున్న ఈవీఎంలు, నేడు ఎందుకు బాగాలేవు 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నట్లా..? అదే ఈవీఎం నేడు ఎందుకు బాగులేవు...? చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టేగా ఆ భయం. ఈవీఎంలనే మేనేజ్ చేసే అవకాశం ఉంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీనే గెలిపించుకునేవాళ్లం కదా. నిన్న, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ ఎందుకు ఓడిపోయేదంటూ ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశ్వసనీయత లేని బాబు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. కానీ చంద్రబాబు ఇంట ఓడిపోబోతున్నాడు కానీ రచ్చ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. చంద్రబాబు ప్రవర్తన చూస్తూ అధికార పక్షమూ ఆయనే వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష బాధ్యతలను ఆయనే నెరవేరుస్తున్నాడు. ఇలా ద్వంద్వ విధాలను అవలంభిస్తుండడం వలనే మొట్ట మొదటి నుంచి ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు ఈవీఎంల వరకు ఆయన మాట్లాడిన మాటల్లో విశ్వసనీయతను కోల్పోయాడు కాబట్టే ఆయనను ప్రజలు పక్కన పెట్టబోతున్నారని సాంబయ్య చెప్పారు. మోడీని కించపరచడం దారుణం ప్రధాని మోడీ కంటే తానే సీనియర్‌నని చంద్రబాబు చెప్పుకుంటాడు. కలెక్టర్ కంటే తహశీల్దార్ సీనియర్ అయి ఉంటాడు. అంతమాత్రం చేత తహశీల్దార్ చెప్పినట్లు కలెక్టర్ వినాలా..? కలెక్టర్ చెప్పినట్లు తహశీల్దార్ వినాలా..? ఆర్డర్ ఆఫ్ ప్రోటోకాల్ పాటించకుండా మోడీని కించపరచటం, దారుణంగా మాట్లాడటం కూడా ప్రజల్లో చంద్రబాబు ప్రవర్తనా తీరుపైప్రజలు విసుగెత్తిపోయారని సాంబయ్య స్పష్టం చేశారు. జగన్ సీఎం కావడం ఖాయం రేపు మే నెల 23న రాష్ట్రంలో వైఎస్సార్సీపీ గెలిచి జగన్ సీఎం కావడం ఖాయం. కేంద్రంలో మోడీ తిరిగి ప్రధాని కావడం ఖాయమన్నారు. ఏప్రిల్ నెల 11న ఫ్యాన్‌కే పట్టాభిషేకం అని తాను చెప్పిన జోస్యం నిజం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి 130 సీట్లుకు తగ్గకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి సర్వేలో హేతుబద్దత లేదని, ఆయన సర్వే ఏదో ఒక పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో చెప్పినట్లుగా ఉందే తప్ప అది సర్వే కాదు. సర్వేలో ప్రజల అభిప్రాయాలు ప్రతిబింభించాలే తప్ప ఎవరికో లబ్ధి చేకూర్చేలా ఉండే వాటిని సర్వేలని చెప్పడం సమంజసం కాదని లగడపాటి సర్వేను కొట్టిపారేశారు. -
ఫ్యాన్‌కే పట్టాభిషేకం
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): ప్రజాభిప్రాయం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి వైపే ఉంది. రాష్ట్రంలో జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరే. ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి నిజాయితీగా నిబద్దతతో పోరాడుతోంది, పార్లమెంట్ దాక, ఢిల్లీ వీధుల్లో మొట్టమొదట గళం విప్పిన పార్టీ వైఎస్సార్ సీపీనే అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌గా, ఎక్సైజ్ కమిషనర్‌గా, ఎమ్మెల్యేగా సేవలందించిన ఈయన ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సాంబయ్య పనిచేశారు. 13 జిల్లాల్లోని పలువురితో తనకున్న అనుబంధం, పరిచయాల ద్వారా ప్రస్తుత రాజకీయాలపై లోతుగా అధ్యయనం చేసిన దారా సాంబయ్య తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.. చంద్రబాబువి పసలేని ఆరోపణలు కేంద్రంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విధానాలను చంద్రబాబు రాష్ట్రంలో తనవిగా చెప్పుకోవడమే కాకుండా తన కరపత్రాలైన కొన్ని మీడియా సంస్థల ద్వారా మోడీపై పసలేని ఆరోపణలు చేశారు. నిలకడైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఫలితంగా టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గింది. జగన్ ఇచ్చిన హామీలతో వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ బలోపేతమైంది. హోదా కోసం నిలబడింది జగనే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని తొలి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు, యువకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లోకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తీసుకుపోయారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సఫలమయ్యారు. దానితో ప్రత్యేక హోదా గళాన్ని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ పార్లమెంట్‌ను తాకే విధంగా జగన్ చేసిన ప్రయత్నాలు, అందుకు వస్తున్న ఆదరణ చూసి ప్యాకేజీకి కట్టుబడిన చంద్రబాబులో వణుకు పుట్టించారు. దానితో చేసేది లేక చంద్రబాబునాయుడు కూడా కేంద్రంతో చేసుకున్న లోపాయికారి ప్యాకేజీ ఒప్పందాన్ని సైతం వద్దని హోదా వైపు మొగ్గేలా చేశారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారే తప్ప ఆయనకు హోదాపై అవగాహన ఉండి కాదు. ఇష్టం ఉండి కాదు. ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దారుణం చంద్రబాబు నిర్ణయాల వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు టీడీపీ మునుపటి వైభవం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగానే 2014లో టీడీపీ అధికారంలోకి రాగలిగింది తప్ప స్వయంగా టీడీపీ పోటీచేస్తే టీడీపీ అప్పుడే ఓడిపోయి ఉండేది. ఇప్పుడు ఆ నాటి పరిస్థితులు లేవు. జనసేన సొంతంగా వేరు కుంపటి పెట్టుకుంది. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాల్లో టీడీపీ చతికిలపడింది. ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండటం వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వచ్చిన 70–80 లక్షల ఓటు బ్యాంక్‌కు గండి పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది తప్ప మిగిలిన చోట్ల ఎదురుగాలి వీస్తోంది. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా ప్రజలు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. జిల్లాల్లో కూడా టీడీపీ భారీగా సీట్లు కోల్పోతుందని తేలింది. 130 నుంచి 150 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు జనం నాడిని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్లమెంట్ స్థానాల్లో 20 నుంచి 23 వరకు గెలుచుకునే అవకాశం గట్టిగా ఉంది. ఇది నేను ఆషామాషీగా చెప్పడం లేదు. టీడీపీకి 25–30 స్థానాలకు మించి వచ్చే అవకాశమే లేదు. 2004లో వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఉద్యోగం, రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత 45 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరిగి పనిచేసిన అనుభవం ఉంది. ప్రతి 10 మందిలో 8 మంది వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ అయినవారు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రైతులు, దళిత నేతలతో 13 జిల్లాల్లో నాకున్న పరిచయాల ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి బలమైన గాలి వీస్తోందని తెలుసుకున్నా. అదే సమయంలో 2014తో పోల్చుకుంటే బీజేపీకి ఈసారి ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. దాంతో గతంతో పోల్చుకుంటే మెరుగైన స్థానాలు వచ్చే అవకాశం ఉంది. -
సాంబయ్య కారుపై దాడికి యత్నించి టీడీపీ కార్యకర్తలు
-
సాంబయ్య కారుపై దాడికి యత్నించి టీడీపీ కార్యకర్తలు
సాక్షి, గుంటూరు/అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పిందని ఆరోపిస్తూ టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఏపీ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనలకు దిగాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు దారా సాంబయ్య కారును నిరసనకారులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడికి యత్నించారు. అయితే పోలీసుల జోక్యంతో సాంబయ్య అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే
విజయవాడ : ఇంకా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల మధ్య పదవుల కోసం గొడవ మొదలైందని, కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 150 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్య విలువలు లేవని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 21 మంది వైఎస్సార్సీపీ నాయకులను తీసుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయం గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వద్దు, అది సంజీవని కాదని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆ పార్టీ నాయకులే ఇప్పుడు కావాలని మాట్లాడుతున్నారని అన్నారు. -
వాడిన ‘కమలం’
ఒంగోలు, న్యూస్‌లైన్ : టీడీపీ, బీజేపీ పొత్తుతో జిల్లాలో ఉత్సాహంగా ముందుకు కదిలిన కమలనాథులు.. ఎల్లో పార్టీ చేసిన ద్రోహంతో చివరకు పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రారంభంలో మాత్రం పొత్తు ఉల్లంఘిస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు చివరకు చేసేదేమీ లేక తమ అభ్యర్థితో కూడా సైకిల్‌కు జై కొట్టించారు. సైకిల్ చక్రం తిరగాలంటే మోడీ ప్రభంజనమే దిక్కన్న నేతలు.. ప్రస్తుతం తలవంచారు. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో సంతనూతలపాడు అసెంబ్లీకి రెండు పార్టీల నుంచి తానే అసలైన అభ్యర్థినని, రెండు పార్టీల వారూ తనకే ఓటేయాలని ప్రచారం చేపట్టిన దారా సాంబయ్య కూడా ఇప్పుడు తనదారి మార్చుకున్నారు. కానీ, సైకిల్‌తో పొత్తే తమ కొంపముంచిందంటూ ఓటర్ల ముందు లేని అమాయకత్వాన్ని నటించేందుకు సిద్ధమవుతున్నారు. రెండనుకుంటే ఒకటి కూడా లేకుండా పోయిన వైనం... టీడీపీతో పొత్తు నేపథ్యంలో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి బీజేపీ సై అంది. కానీ, రెండు పార్టీల అధిష్టానాల చర్చల్లో ఒకసీటుకే పరిమితమైంది. గిద్దలూరు అసెంబ్లీని వదులుకుంది. సంతనూతలపాడును మాత్రమే బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ నేత దారా సాంబయ్య పోటీచేశారు. కానీ, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పోటీచేయడం, ఆ పార్టీ అధిష్టానం అతనికి బీ ఫారం కూడా అందించడంతో కంగుతిన్నారు. ఇలాగైతే ఊరుకోమని హెచ్చరించారు. తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, చివరకు చేసేదిలేక వాడిపోయిన కమలం కంటే ఓడిపోయే సైకిలే మిన్నని భావించి టీడీపీతో చేతులు కలిపి మొక్కుబడిగా పోటీలో నిలిచారు. దీంతో జిల్లాలో ఒకస్థానంలో కూడా బీజేపీ పోటీచేయనట్లయింది. ఆ పార్టీ జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ చేసిన ద్రోహంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.