ఫ్యాన్‌కే పట్టాభిషేకం | Sakshi Interview With Dara Sambaiah | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌కే పట్టాభిషేకం

Published Thu, Apr 11 2019 11:05 AM | Last Updated on Thu, Apr 11 2019 11:10 AM

Sakshi Interview With Dara Sambaiah

సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): ప్రజాభిప్రాయం ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉంది. రాష్ట్రంలో జనం మెచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి నిజాయితీగా నిబద్దతతో పోరాడుతోంది, పార్లమెంట్‌ దాక, ఢిల్లీ వీధుల్లో మొట్టమొదట గళం విప్పిన పార్టీ వైఎస్సార్‌ సీపీనే అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌గా, ఎక్సైజ్‌ కమిషనర్‌గా, ఎమ్మెల్యేగా సేవలందించిన ఈయన ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సాంబయ్య పనిచేశారు. 13 జిల్లాల్లోని పలువురితో తనకున్న అనుబంధం, పరిచయాల ద్వారా ప్రస్తుత రాజకీయాలపై లోతుగా అధ్యయనం చేసిన దారా సాంబయ్య తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.. 

చంద్రబాబువి పసలేని ఆరోపణలు
కేంద్రంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విధానాలను చంద్రబాబు రాష్ట్రంలో తనవిగా చెప్పుకోవడమే కాకుండా తన కరపత్రాలైన కొన్ని మీడియా సంస్థల ద్వారా మోడీపై పసలేని ఆరోపణలు చేశారు. నిలకడైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఫలితంగా టీడీపీ ఓటు బ్యాంక్‌ తగ్గింది. జగన్‌ ఇచ్చిన హామీలతో వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంక్‌ బలోపేతమైంది.

హోదా కోసం నిలబడింది జగనే..
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని తొలి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు, యువకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లోకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తీసుకుపోయారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సఫలమయ్యారు. దానితో ప్రత్యేక హోదా గళాన్ని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ పార్లమెంట్‌ను తాకే విధంగా జగన్‌ చేసిన ప్రయత్నాలు, అందుకు వస్తున్న ఆదరణ చూసి ప్యాకేజీకి కట్టుబడిన చంద్రబాబులో వణుకు పుట్టించారు. దానితో చేసేది లేక చంద్రబాబునాయుడు కూడా కేంద్రంతో చేసుకున్న లోపాయికారి ప్యాకేజీ ఒప్పందాన్ని సైతం వద్దని హోదా వైపు మొగ్గేలా చేశారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారే తప్ప ఆయనకు హోదాపై అవగాహన ఉండి కాదు. ఇష్టం ఉండి కాదు. 

ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దారుణం
చంద్రబాబు నిర్ణయాల వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు టీడీపీ మునుపటి వైభవం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగానే 2014లో టీడీపీ అధికారంలోకి రాగలిగింది తప్ప స్వయంగా టీడీపీ పోటీచేస్తే టీడీపీ అప్పుడే ఓడిపోయి ఉండేది. ఇప్పుడు ఆ నాటి పరిస్థితులు లేవు. జనసేన సొంతంగా వేరు కుంపటి పెట్టుకుంది. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాల్లో టీడీపీ చతికిలపడింది.

ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండటం వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వచ్చిన 70–80 లక్షల ఓటు బ్యాంక్‌కు గండి పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది తప్ప మిగిలిన చోట్ల ఎదురుగాలి వీస్తోంది. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారు. జగన్‌ ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. జిల్లాల్లో కూడా టీడీపీ భారీగా సీట్లు కోల్పోతుందని తేలింది.

130 నుంచి 150 సీట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సొంతం
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు జనం నాడిని పరిశీలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 130 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్లమెంట్‌ స్థానాల్లో 20 నుంచి 23 వరకు గెలుచుకునే అవకాశం గట్టిగా ఉంది. ఇది నేను ఆషామాషీగా చెప్పడం లేదు. టీడీపీకి 25–30 స్థానాలకు మించి వచ్చే అవకాశమే లేదు. 2004లో వైఎస్‌ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఉద్యోగం, రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత 45 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా.

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరిగి పనిచేసిన అనుభవం ఉంది. ప్రతి 10 మందిలో 8 మంది వైఎస్సార్‌ సీపీకే అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్‌ అయినవారు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రైతులు, దళిత నేతలతో 13 జిల్లాల్లో నాకున్న పరిచయాల ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి బలమైన గాలి వీస్తోందని తెలుసుకున్నా. అదే సమయంలో 2014తో పోల్చుకుంటే బీజేపీకి ఈసారి ఓటు బ్యాంక్‌ గణనీయంగా పెరిగింది. దాంతో గతంతో పోల్చుకుంటే మెరుగైన స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement