
సాక్షి, గుంటూరు/అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పిందని ఆరోపిస్తూ టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఏపీ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనలకు దిగాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు దారా సాంబయ్య కారును నిరసనకారులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడికి యత్నించారు. అయితే పోలీసుల జోక్యంతో సాంబయ్య అక్కడ నుంచి వెళ్లిపోయారు.