ఒంగోలు, న్యూస్‌లైన్ : టీడీపీ, బీజేపీ పొత్తుతో జిల్లాలో ఉత్సాహంగా ముందుకు కదిలిన కమలనాథులు.. ఎల్లో పార్టీ చేసిన ద్రోహంతో చివరకు పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రారంభంలో మాత్రం పొత్తు ఉల్లంఘిస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు చివరకు చేసేదేమీ లేక తమ అభ్యర్థితో కూడా సైకిల్‌కు జై కొట్టించారు. సైకిల్ చక్రం తిరగాలంటే మోడీ ప్రభంజనమే దిక్కన్న నేతలు.. ప్రస్తుతం తలవంచారు. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో సంతనూతలపాడు అసెంబ్లీకి రెండు పార్టీల నుంచి తానే అసలైన అభ్యర్థినని, రెండు పార్టీల వారూ తనకే ఓటేయాలని ప్రచారం చేపట్టిన దారా సాంబయ్య కూడా ఇప్పుడు తనదారి మార్చుకున్నారు. కానీ, సైకిల్‌తో పొత్తే తమ కొంపముంచిందంటూ ఓటర్ల ముందు లేని అమాయకత్వాన్ని నటించేందుకు సిద్ధమవుతున్నారు.
రెండనుకుంటే ఒకటి కూడా లేకుండా పోయిన వైనం...
టీడీపీతో పొత్తు నేపథ్యంలో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి బీజేపీ సై అంది. కానీ, రెండు పార్టీల అధిష్టానాల చర్చల్లో ఒకసీటుకే పరిమితమైంది. గిద్దలూరు అసెంబ్లీని వదులుకుంది. సంతనూతలపాడును మాత్రమే బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ నేత దారా సాంబయ్య పోటీచేశారు. కానీ, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పోటీచేయడం, ఆ పార్టీ అధిష్టానం అతనికి బీ ఫారం కూడా అందించడంతో కంగుతిన్నారు. ఇలాగైతే ఊరుకోమని హెచ్చరించారు. తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, చివరకు చేసేదిలేక వాడిపోయిన కమలం కంటే ఓడిపోయే సైకిలే మిన్నని భావించి టీడీపీతో చేతులు కలిపి మొక్కుబడిగా పోటీలో నిలిచారు. దీంతో జిల్లాలో ఒకస్థానంలో కూడా బీజేపీ పోటీచేయనట్లయింది. ఆ పార్టీ జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ చేసిన ద్రోహంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాడిన ‘కమలం’
Published Wed, Apr 30 2014 2:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement