చీకటి ఆలోచనల స్కానర్
‘‘ఇది పన్నెండేళ్ల క్రితం జరిగింది. దాంతో నా జీవిత అధ్యాయం ముగిసిపోయింది. నేను యిలా అనటం మోడరన్ కాలేజీ పిల్లవైన నీకు అర్థం లేని మాటలా అనిపించవచ్చు. బాయ్‌ఫ్రెండ్ ఉండటంలో, డేటింగ్ ఉండటంలో, ప్రీ మారిటల్ సెక్స్ ఉండటంలో ఘనత ఉంది. ఇవన్నీ సహజమైన విషయాలు అని భావించేటువంటి యుగంలో పుట్టిన నీకు యింత చిన్న విషయానికి జీవితం ముగిసిపోవడమా? అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని ప్రపంచంలో వారి వారి పరిధులను బట్టి నడుచుకునే మనుషులు కొందరుంటారు. లోకంలో రకరకాల పిచ్చివాళ్లుంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందమన్నట్లు, అటువంటి పిచ్చితనానికి బలైనవారిలో నేనొకదాన్ని.’’
‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల్లో ముఖ్య పాత్ర గంగ తన గురించి మంజు అనే ఒక అమ్మాయితో అన్న మాటలు యివి. తమిళ రచయిత జయకాంతన్ నవల ‘శిల నేరంగళిల్ శిల మనిదరగళ్’కి తెలుగు రూపం ఇది. 1981లో నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం మాలతీ చందూర్ దీన్ని అనువదించారు. ఆ రోజుల్లో సాహితీలోకంలో దుమ్మురేపి, స్త్రీ, పురుష సంబంధాలను గురించి కొత్త కోణాల్ని విప్పిచూపిన నవల.
మనుషులు తమకన్నా బలహీనుల్ని లొంగదీసుకోవటం కోసం, విలువలు, కట్టుబాట్లు ఆయుధాలుగా చేసుకుంటారు. అప్పటికీ వాళ్లు లొంగకపోతే, చెడినవాళ్లనో, ప్రమాదకారులనో ముద్రలు వేసి, సమాజం పరిధి నంచి తరిమేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో బయటపడే తమ చీకటి కోణాలకి సంప్రదాయాల పేరుతో ముసుగు కప్పుతారు.
ఒక వర్షపు సాయంకాలం అపరిచితుడిచే రేప్ చేయబడ్డ 17 ఏళ్ల గంగని, తల్లితో సహా బయటికి గెంటేస్తాడు అన్న. మేనమామ వరసైన ఒక పెద్ద మనిషి చేరదీసి, చదువు చెప్పించి, గంగ తన కాళ్లమీద తను నిలబడేలా చేస్తాడు. అయితే గంగ పట్ల అతని ఎజెండా అతనిది. వయసులో ఎంతో పెద్దవాడైన తను, ఆ అమ్మాయిని లొంగదీసుకుంటే, విషయం గుట్టుగా ఉంటుంది. ఎలాగో చెడిపోయింది, కాబట్టి ఆ అమ్మాయికి వేరే దారి లేదు.
ఓ నాటకీయ పరిస్థితిలో గంగ, తనను రేప్ చేసినవాడిని కలుస్తుంది. భ్రష్టుడైన తన వల్ల ఆ అమ్మాయికి జరిగిన అవమానానికి అతడు బాధపడ్తాడు. ఆ అమ్మాయిని తన కూతురిలా భావిస్తాడు. విశాల భావాలున్న వాడిని చూసి, ఆ అమ్మాయికి పెళ్లి చేసి, తన పాపం కడుక్కుందాం అనుకుంటాడు. అయితే జీవితంలో ఎప్పుడూ చూడని ఆప్యాయత, ప్రేమ అతని నుంచి పొందిన ఆమెకి, అతనితో తప్ప జీవితం ఎవరితో వద్దనుకుంటుంది. అయితే పెళ్లి చేసుకుంటే గాని, తనను చూడను అన్న అతని ఆదేశాన్ని తిరస్కరించి, మనుషుల పట్ల, ప్రపంచం పట్ల ద్వేషం పెంచుకొని, ఆ కోపంలో తనను తాను దహించుకుని పతనానికి జారిపోతుంది.
కథ ఏంటి అనే దాని కన్నా, ఆ పాత్రలు వేర్వేరు సమయాలలో విభిన్నంగా ప్రవర్తించే తీరు, వాటి స్వభావం, ఘర్షణ చదివేవారిని చాలా అలజడికి గురిచేస్తాయి.
తెలీక జరిగిన తప్పుని, తన తెలివితక్కువతనంతో మహాపరాధంగా కూతురి జీవితం మీద రుద్ది, ఆమె బతుకుని దుర్భరం చేసిన తల్లి, చేరదీసిన దగ్గర్నుంచి, అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ సంఘటనను గుర్తుచేస్తూ, ‘‘నువ్వు చెడిపోయావు. నీలాంటి వాళ్లని ఎవరో ఒకరు ఉంచుకోవటం తప్ప దారిలేదు’’ అంటూ తన కోరికను రుద్దడానికి ప్రయత్నించే మేనమామ వరసైన వెంకట్రామయ్యర్, ఇంట్లోంచి గెంటివేసిన, తన కాళ్ల మీద తాను నిలబడ్డం సహించలేని అన్న గణేశ్, తన సరదా ఒక అమ్మాయి జీవితాన్ని కుదిపేసిందని తెల్సి, ఏదైనా చేసి ఆ అమ్మాయిని ఓ ఇంటిదాన్ని చేసి, తన తప్పుని దిద్దుకోవాలని ప్రయత్నించిన ప్రభు, తండ్రికీ గంగకీ ఉన్న సంబంధాన్ని గౌరవంగా అంగీకరించిన కాలేజీ అమ్మాయి మంజు, ఇలా గంగ చుట్టూ ఉన్న ప్రతి పాత్ర, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని, ఒక్కోసారి మనల్ని పోలి భయపెడ్తాయి.
ఈ నవలని తమిళంలో అదే పేరుతో దర్శకుడు భీమ్‌సింగ్ 1976లో సినిమాగా తీసి, డబ్బుల్ని, అవార్డుల్ని కూడా కొట్టేశారు. లక్ష్మి చాలా బాగా నటించిన సినిమా ఇది. అయితే గొప్ప నవలల్ని సెంటిమెంటల్ ట్రాష్‌గా ‘పవిత్ర ప్రేమ’ లాంటి ముగింపు ఇవ్వటం సినిమావాళ్లకే చెల్లుతుంది.
మనుషుల్లోని చీకటి ఆలోచనల్ని స్కాన్ చేసే ఇలాంటి రచనలు మనల్ని మనముందే నగ్నంగా పెట్టి ప్రశ్నిస్తాయి. అందుకే, ఈ నవల అన్ని సమయాలలో అందరు మనుషుల్ని కలవరపరుస్తుంది.
-కృష్ణ మోహన్‌బాబు
ఫోన్: 9848023384