న్యాయపోరాటం చేస్తూ అనంతలోకాలకు...
లండన్: స్కాట్లాండ్ లో న్యాయపోరాటం చేస్తున్న ప్రవాస భారతీయుడొకరు తనువు చాలించారు. తన కొడుకు హత్య కేసులో న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఆ తండ్రి తుదిశ్వాస విడిచాడు. దర్శణ్ సింగ్ చోకర్ కన్నుమూశారని అతడి తరపు న్యాయవాది ఆమీర్ అన్వర్ తెలిపారు. తన కుమారుడిని చంపిన హంతకులను చట్టం ముందు నిలబెట్టేందుకు గత 17 ఏళ్లుగా దర్శణ్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దర్శణ్ చనిపోయినా ఆయన ఆశయం బతికే ఉందని వ్యాఖ్యానించారు.
హోటల్ లో వెయిటర్ పనిచేస్తూ దర్శణ్ కుమారుడు సుర్జీత్ 1998లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి దర్శణ్ న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈ కేసులో రొని కౌల్టర్(47), ఆండ్రూ కౌల్టర్, డేవిడ్ మంట్గోమెరీ నిందితులుగా ఉన్నారు. సుర్జీత్ పై కత్తులతో దాడి జరిగినప్పుడు వీరు అతడి దగ్గర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్య జరిగినప్పుడు రక్తంతో తడిసిన దుస్తులను దాచేందుకు ప్రయత్నించాడని కూడా కౌల్టర్ పై అభియోగాలు మోపారు. కోర్టులో కేసు నడుస్తుండగానే దర్శణ్ సింగ్ కన్నుమూయడం విషాదం.