ఐడియా, రిలయన్స్ డేటా యూజర్లకు న్యూ స్కీమ్స్
న్యూఢిల్లీ : కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించే లక్ష్యంతో, రెండు అతిపెద్ద టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కొత్త స్కీమ్ లను ప్రవేశపెట్టాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ తన 3జీ, 2జీ నెట్ వర్క్ ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం డేటా లోన్ సర్వీసును ఆవిష్కరించగా... ఐడియా సెల్యులార్ రాత్రిపూట నెట్ వాడుకునే యూజర్లకు 4జీ, 3జీ డేటా ధరలను 50శాతం తగ్గించనుందని ప్రకటించింది. డేటా యూజర్లకు ఈ స్కీమ్ లు ఎంతో సహకరించనున్నట్టు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. డేటా లోన్ సర్వీసు ద్వారా తక్కువ డేటా ఉన్న ప్రీఫైడ్ కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి, వెంటనే 60ఎమ్ బీ వరకూ డేటా లోన్ పొందవచ్చని రిలయన్స్ కమ్యూనికేషన్ తెలిపింది.
రిలయన్స్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లకు డేటా సర్వీసులు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, ఏ సమయంలో కూడా (రాత్రిపూట కూడా) డేటా సర్వీసులకు ఆటంకం వాటిల్లకుండా ఉంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుర్ దీప్ సింగ్ తెలిపారు. ఐడియా ప్రకటించిన స్కీమ్ ద్వారా నెలకు రూ.125 కే 1జీబీ డేటాను రాత్రిపూట అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల మామూలు ధరల కంటే తక్కువగా 50శాతం పొదుపు చేసుకోవచ్చని ఐడియా సెల్యులార్ తెలిపింది. అదేవిధంగా డే అండ్ నైట్ ట్విన్ ప్యాక్ నూ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా నెలకు 500 ఎమ్ బీ డేటా నుంచి 40జీబీ డేటా రీఛార్జ్ వరకూ 30శాతం డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది.