david headly
-
మా స్కూలు మీద బాంబేశారు.. అందుకే కోపం
తాను చిన్నవయసులో ఉండి స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచే భారతదేశం అంటే చాలా కోపమని పాక్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. 1971 డిసెంబర్ నెలలో తాను చదువుకునే స్కూలు మీద భారత విమానాలు బాంబులు వేశాయని, అందుకే ఆ దేశం మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తాను లష్కర తాయిబా ఉగ్రవాద సంస్థలో చేరానని తెలిపాడు. అమెరికా జైల్లో ఉన్న హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారణలో పాల్గొని ఈ విషయం వెల్లడించాడు. భారతదేశం అన్నా భారతీయులన్నా తనకు చిన్నతనం నుంచి విపరీతమైన ద్వేషం ఉందనని, వాళ్లకు వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని అనుకునేవాడినని అన్నాడు. 1971 డిసెంబర్ 3 నుంచి 16వ తేదీ వరకు భారత్- పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. అప్పటికి హెడ్లీకి 11 సంవత్సరాలు. అప్పట్లో భారత విమానాలు చేసిన బాంబుదాడిలో అతడి స్కూలు పూర్తిగా పడిపోయింది. పాకిస్తానీ తండ్రికి, అమెరికన్ తల్లికి పుట్టిన హెడ్లీ.. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు పాకిస్తాన్లో చదివి, తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. 2002లో లష్కరే తాయిబాలో చేరినట్లు ముంబై కోర్టులో వెల్లడించాడు. 2009లో అతడిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. లష్కరే తాయిబా గురించిన సమాచారం ఇస్తే మరణశిక్ష విధించబోమని అతడికి అమెరికా హామీ ఇచ్చింది. తర్వాత 35 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
శివసేన అధినేతను చంపాలనుకున్నా!
పాకిస్థానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో శివసేన కార్యాలయం మీద దాడి చేయడానికి.. లేదా దాని అధినేతను హతమార్చేందుకు వీలుగా ముందు నుంచే ఎవరైనా శివసేన కీలక సభ్యుడితో సంబంధాలు పెంచుకోవాలని కూడా తాను భావించినట్లు తెలిపాడు. సేన భవన్లో తాను రాజారామ్ రెగె అనే శివసేన కార్యకర్తను కలిశానని, అతడితో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేశానని చెప్పాడు. 26/11 దాడుల్లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్టు మీద ఎందుకు దాడి చేయలేదని లష్కరే తాయిబా తీవ్ర అసంతృప్తికి గురైందని చెప్పాడు. అయితే.. సిద్ది వినాయక ఆలయం మీద, నావల్ ఎయిర్ స్టేషన్ మీద దాడులు చేయద్దని తానే చెప్పానని, ఆ రెండు ప్రాంతాలలో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 10 మంది ఉగ్రవాదులు అక్కడే ఉండాల్సి వస్తుందని దాడులు వద్దన్నట్లు ముంబై కోర్టుకు వీడియా కాన్ఫరెన్సు విచారణలో తెలిపాడు. తొలుత సిద్ది వినాయక ఆలయంలో రెక్కీ చేసి.. అప్పుడే అక్కడ దాడి చేయాల్సిన ఉగ్రవాదుల కోసం ఎరుపు, పసుపు రంగు తాళ్లను కొన్నానని.. వాటిని ఉగ్రవాదులు తమ మణికట్టుకు కట్టుకుంటే వాళ్లను హిందువులుగా భావిస్తారనే అలా చేశానని చెప్పాడు. ముంబై తాజ్ మహల్ హోటల్‌కు అత్యంత సమీపంలో ఉండే గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద దిగాలని జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు చెప్పాడన్నాడు. భాభా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో పనిచేసే ఎవరైనా ఉద్యోగిని పట్టుకుని, అతడి ద్వారా తమకు సమాచారం సేకరించాలని ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ పని అప్పగించినట్లు కూడా హెడ్లీ తాజాగా వెల్లడించాడు. -
భారత్ రావడానికే పేరు మార్చుకున్నా: హెడ్లీ
ముంబై మహానగరంలో జరిగిన 26/11 మారణహోమం వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హస్తం ఉందన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను లష్కరే తాయిబాకు అసలైన అనుచరుడినని ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ వెల్లడించాడు. కేవలం భారతదేశంలో ప్రవేశించడానికే తాను అమెరికన్లా పేరు మార్చుకున్నట్లు చెప్పాడు. తన అసలు పేరు దావూద్ గిలానీ అని.. ఆ పేరు ఉంటే రావడం కుదరదని పేరు మార్చుకున్నానని వీడియో లింకు ద్వారా హెడ్లీ సోమవారం ఉదయం ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణకు హాజరై.. ఈ వివరాలు వెల్లడించాడు. తన పేరు మార్చుకున్న తర్వాత ఆ సమాచారాన్ని లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్‌కు చెప్పానన్నాడు. పేరు మార్చుకున్న కొన్ని వారాల తర్వాత పాకిస్థాన్ వెళ్లానని, భారతదేశంలో ప్రవేశించడానికి మాత్రమే పేరు మార్చానని చెప్పాడు. భారతదేశంలో ఏదైనా వ్యాపారం లేదా ఆఫీసు పెట్టాలని సాజిద్ మీర్ తనకు చెప్పాడని, అతడి అసలు ఉద్దేశం ఏంటో.. తాను తొలిసారి భారతదేశం సందర్శించానికి కొద్ది ముందే చెప్పాడని హెడ్లీ తెలిపాడు. కొత్త పేరుతో తనకు పాస్‌పోర్టు వచ్చిన తర్వాత భారత దేశానికి 8 సార్లు వచ్చానని, అందులో 7 సార్లు ముంబై నగరంలోనే తిరిగానని అతడు అన్నాడు. ఒక్కసారి మాత్రమే తాను దుబాయ్ నుంచి భారత్ వెళ్లానని, మిగిలిన 7 సార్లూ నేరుగా పాకిస్థాన్ నుంచే వెళ్లానని వివరించాడు. తన వీసా దరఖాస్తులో తాను పుట్టిన ఊరు, తేదీ, తల్లి జాతీయత, తన పాస్‌పోర్టు నంబర్ తప్ప అన్నీ తప్పులేనని తెలిపాడు. 2015 డిసెంబర్లో హెడ్లీ ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోయాడు. పేలుళ్లకు మొత్తం కుట్ర పన్నిందంతా లష్కరే తాయిబాయేనని, దానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అనుమతి కూడా ఉందని హెడ్లీ అంటున్నాడు. ముంబైలో రెక్కీ చేయడానికి కూడా తనకు ఆర్థిక సహకారం అందించింది ఐఎస్ఐ సంస్థేనన్నాడు. తాను ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఇల్లు, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాల వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. కాగా.. డేవిడ్ హెడ్లీ తరఫున ప్రముఖ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదిస్తున్నారు.