శివసేన అధినేతను చంపాలనుకున్నా!
పాకిస్థానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో శివసేన కార్యాలయం మీద దాడి చేయడానికి.. లేదా దాని అధినేతను హతమార్చేందుకు వీలుగా ముందు నుంచే ఎవరైనా శివసేన కీలక సభ్యుడితో సంబంధాలు పెంచుకోవాలని కూడా తాను భావించినట్లు తెలిపాడు. సేన భవన్‌లో తాను రాజారామ్ రెగె అనే శివసేన కార్యకర్తను కలిశానని, అతడితో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేశానని చెప్పాడు.
26/11 దాడుల్లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్టు మీద ఎందుకు దాడి చేయలేదని లష్కరే తాయిబా తీవ్ర అసంతృప్తికి గురైందని చెప్పాడు. అయితే.. సిద్ది వినాయక ఆలయం మీద, నావల్ ఎయిర్ స్టేషన్ మీద దాడులు చేయద్దని తానే చెప్పానని, ఆ రెండు ప్రాంతాలలో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 10 మంది ఉగ్రవాదులు అక్కడే ఉండాల్సి వస్తుందని దాడులు వద్దన్నట్లు ముంబై కోర్టుకు వీడియా కాన్ఫరెన్సు విచారణలో తెలిపాడు. తొలుత సిద్ది వినాయక ఆలయంలో రెక్కీ చేసి.. అప్పుడే అక్కడ దాడి చేయాల్సిన ఉగ్రవాదుల కోసం ఎరుపు, పసుపు రంగు తాళ్లను కొన్నానని.. వాటిని ఉగ్రవాదులు తమ మణికట్టుకు కట్టుకుంటే వాళ్లను హిందువులుగా భావిస్తారనే అలా చేశానని చెప్పాడు. ముంబై తాజ్ మహల్ హోటల్‌కు అత్యంత సమీపంలో ఉండే గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద దిగాలని జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు చెప్పాడన్నాడు. భాభా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో పనిచేసే ఎవరైనా ఉద్యోగిని పట్టుకుని, అతడి ద్వారా తమకు సమాచారం సేకరించాలని ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ పని అప్పగించినట్లు కూడా హెడ్లీ తాజాగా వెల్లడించాడు.