మా స్కూలు మీద బాంబేశారు.. అందుకే కోపం
తాను చిన్నవయసులో ఉండి స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచే భారతదేశం అంటే చాలా కోపమని పాక్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. 1971 డిసెంబర్ నెలలో తాను చదువుకునే స్కూలు మీద భారత విమానాలు బాంబులు వేశాయని, అందుకే ఆ దేశం మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తాను లష్కర తాయిబా ఉగ్రవాద సంస్థలో చేరానని తెలిపాడు. అమెరికా జైల్లో ఉన్న హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారణలో పాల్గొని ఈ విషయం వెల్లడించాడు. భారతదేశం అన్నా భారతీయులన్నా తనకు చిన్నతనం నుంచి విపరీతమైన ద్వేషం ఉందనని, వాళ్లకు వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని అనుకునేవాడినని అన్నాడు.
1971 డిసెంబర్ 3 నుంచి 16వ తేదీ వరకు భారత్- పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. అప్పటికి హెడ్లీకి 11 సంవత్సరాలు. అప్పట్లో భారత విమానాలు చేసిన బాంబుదాడిలో అతడి స్కూలు పూర్తిగా పడిపోయింది. పాకిస్తానీ తండ్రికి, అమెరికన్ తల్లికి పుట్టిన హెడ్లీ.. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు పాకిస్తాన్‌లో చదివి, తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. 2002లో లష్కరే తాయిబాలో చేరినట్లు ముంబై కోర్టులో వెల్లడించాడు. 2009లో అతడిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. లష్కరే తాయిబా గురించిన సమాచారం ఇస్తే మరణశిక్ష విధించబోమని అతడికి అమెరికా హామీ ఇచ్చింది. తర్వాత 35 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.