ఓటుకు కోట్లు.. నాటకీయ పరిణామాలు
ఓటుకు కోట్లు కేసులో బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పిన కాసేపటికే.. ఆయన తాను అరెస్టు కాలేదంటూ బయటికొచ్చి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయారు. అలాగే ఈ కేసులో అత్యంత కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో నమోదు చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఒక్కసారి చూద్దాం..
* నోటీసులిచ్చినా రాజీనామా చేయబోనని సన్నిహితులతో తెలిపిన చంద్రబాబు
* ఉదయం 8 గంటలకు ఆంధ్రా పోలీసులను రీకాల్ చేసిన ఏపీ డీజీపీ జెవి రాముడు
* ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్తో డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి భేటీ
* ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ - 6 గంటల పాటు చర్చలు
* ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని పిలిచిన తెలంగాణ ఏసీబీ, కార్యాలయానికి వచ్చిన నరేందర్ రెడ్డి
* ఉదయం 10.50 గంటలకు నిందితుడు మత్తయ్యను ప్రవేశపెట్టిన విజయవాడ పోలీసులు, మత్తయ్యకు ప్రాణ భయం ఉందని వెల్లడి, మత్తయ్య ఫిర్యాదును సీఐడీ పర్యవేక్షిస్తోందని ప్రకటన
* మధ్యాహ్నం12 గంటలకు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈ నెల 24కు వాయిదా వేసిన హైకోర్టు
* మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్, గవర్నర్ తో చర్చలు
* మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం, స్టీఫెన్సన్ కూతురు జెస్సికా, ఇంటి ఓనర్ మార్క్ టేలర్ వాంగ్మూలం కూడా సేకరణ
* సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీ ప్రెస్ మీట్, చంద్రబాబు సర్కారును బర్తరఫ్ చేయాలన్న ధర్మాన
* సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరైన డీజీపీ జేవీ రాముడు
* సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఏసీబీకి ఎన్నికల ప్రధాన సంఘం నుంచి లేఖ, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సూచించిన ఎన్నికల కమిషన్
* సాయంత్రం 4.15 గంటలకు వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు ఏసీబీ వర్గాల సమాచారం
* సాయంత్రం 05.20కి ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వేం నరేందర్ రెడ్డి, అరెస్ట్ కాలేదని ప్రకటన