డెడ్‌స్టోరేజీకి చేరిన సాగర్
మాచర్లటౌన్/ విజయపురిసౌత్ (ప్రకాశం): నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం డెడ్‌స్టోరేజీ అయిన 510 అడుగులకు చేరుకుంది. కేవలం ఒక్క టీఎంసీ నీరు అదనంగా నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. నీటిమట్టం 802.09 అడుగుల వద్ద ఉంది. ఈ నీటిమట్టం 30 టీఎంసీలకు సమానం. వర్షాభావ పరిస్థితులు, కృష్ణా పరివాహక ప్రాంతాలలో నీరు లేకపోవటంతో సాగర్ కాలువలకు మంచినీటిని కూడా విడుదల చేసే పరిస్థితి కనబడటం లేదు.
1992లో 499 అడుగులున్న సమయంలో కూడా సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 1993లో 511, 1995లో 504 అడుగులున్నప్పుడు నీటిని విడుదల చేశారు. రాష్ట్ర విభజన జరగటం, జల వివాదం నేపథ్యంలో ప్రస్తుత స్థితిలో నీటిని విడుదల చేసే అవకాశాలు కన్పించడం లేదు.