తల్లిదండ్రులు భారతీయులు, కొడుకు విదేశీయుడు!
గువాహటి: ఓ వ్యక్తి పౌరసత్వం వ్యవహారంలో అస్సాంకు చెందిన రెండు ట్రిబ్యునళ్లు పరస్పర భిన్నమైన తీర్పులు ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ట్రిబ్యునల్ అతడు విదేశీయుడని చెప్పగా, మరో ట్రిబ్యునల్ మాత్రం అతని తల్లిదండ్రులు భారతీయులేనని పేర్కొంది. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో గ్రామీణాభివృద్ధి మంత్రి రాకీబల్ హుసేన్ ఈ సంగతి వెల్లడించారు.
కాకోధోవా గ్రామానికి చెందిన ఆషాన్ మొల్లా, ఆయన భార్య మనోవారా బేగమ్లు భారత పౌరులని 2003లో అప్పటి అక్రమ వలసదారుల నిర్ధారణ ట్రిబ్యునల్(బార్పేట) ప్రకటించింది. అయితే బార్పేటకే చెందిన విదేశీయుల ట్రిబ్యునల్ 2010లో ఈ దంపతుల కుమారుడు మైనాల్ మోల్లా విదేశీయుడని తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ మైనాల్ వేసిన రివ్యూ పిటిషన్లను గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది.