మానవ మృగాలకు మరణశాసనం
* నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
* ఒక నిస్సహాయురాలిపై ఒళ్లు గగుర్పొడిచే రీతిలో పాశవిక నేరానికి పాల్పడ్డారు
* బాధితురాలిని పెట్టిన చిత్రహింసలు అసాధారణం.. ఆటవికంగా ప్రవర్తించారు
* మానవులు క్షమించడానికి అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు
* మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన హెచ్చరిక పంపాల్సిన అవసరముంది
* దోషులు నలుగురినీ చనిపోయే వరకూ ఉరితీయాలని కోర్టు తీర్పు
* హత్యానేరానికి మరణశిక్ష.. సామూహిక అత్యాచారానికి జీవితఖైదు
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20)లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. గత డిసెంబర్లో ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరు నేరానికి పాల్పడటం.. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది.
ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది.
ఇదే కేసులో ఆరో నిందితుడైన బాల నేరస్తుడికి కొద్ది రోజుల కిందట బాలనేరస్తుల న్యాయ బోర్డు మూడేళ్ల శిక్ష విధించటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన బాధితురాలి కుటుంబం.. ఇదే కేసులో మిగతా నలుగురు దోషులకూ మరణశిక్ష విధించడంపై హర్షం వ్యక్తంచేసింది. ‘‘మేం ఊపిరి బిగబట్టి ఎదురుచూశాం.. ఇప్పుడు ఉపశమనం కలిగింది. దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు’’ అని బాధితురాలి తల్లి స్పందించారు. నిర్భయ కేసులో కోర్టు తీర్పు సారాంశమిదీ...
‘‘ఈ ఘటన తీవ్రత.. ఒళ్లు గగుర్పొడిచే పాశవిక, అసాధారణ ప్రవర్తనను వివరిస్తోంది. బాధితురాలిని ఆమె మరణించటానికి ముందు అమానవీయమైన చిత్రహింసలకు గురిచేయటం ఉమ్మడి అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేయటమే కాదు.. దోషుల చుట్టూ ఉన్న సమాజ రక్షణ హస్తాన్ని ఉపసంహరించాలని చెప్తోంది. దోషుల భయానక చర్య ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా స్పష్టంచేస్తోంది. దోషులు తమ కుట్రలో భాగంగా బాధితులను ప్రలోభపెట్టి బస్సులోకి ఎక్కించారు. బాధితురాలిపై కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అమానవీయమైన చిత్రహింసలకు గురిచేశారు.
నిస్సహాయులైన బాధితులు నగ్నంగా ఉన్నస్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఎముకలు కొరికే చలి రాత్రిలో కదులుతున్న బస్సులో నుంచి నగ్నంగా బయటకు విసిరేశారు. వీరి నేరం వారి అసాధారణమైన మానసిక నైతిక పతనాన్ని వివరిస్తోంది. ఆమె పేగులు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితురాలిని గురిచేసిన బాధలు అసాధారణమైనవి. ఆమె అంతర్గత అవయవాలపై ఎంత క్రూరత్వం చూపారో వైద్య రికార్డుల సాక్ష్యాలను బట్టి స్పష్టమవుతోంది. పదే పదే ఇనుపచువ్వలు, చేతులు పెట్టటం వల్ల బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైందని, ముక్కలుగా తెగిపోయిందని వాస్తవాలు చూపుతున్నాయి.
దోషులు అత్యంత ఆటవికంగా వారి వట్టి చేతులతో, ఇనుపచువ్వలతో ఆమె శరీరంలోపలి అవయవాలను బయటకు లాగివేశారు. ఆమెకు నయంచేయలేని గాయాలు చేశారు. తద్వా రా మానవ క్షమకు అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు. ఇది నిజానికి దోషుల పాశవిక ప్రవర్తనను చూపుతోంది. దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత, ఆమె అంతర్గత అవయవాలను బయటకు లాగివేయటంతో ఆగలేదు. బాధితులను బస్సు వెనుక తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. ఆ తలుపు తెరుచుకోకపోవటంతో బాధితులను జట్టుపట్టుకుని బస్సు ముందలి తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లి కదులుతున్న బస్సు నుంచి విసిరేశారు.
కాబట్టి దోషుల చర్యకు అత్యంత తీవ్రమైన శిక్ష అవసరమని ఇది చెప్తోంది. మహిళలపై దారుణ నేరాలు అంతులేకుం డా సాగుతున్న కాలమిది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినమైన హెచ్చరిక సందేశాన్ని పంపాల్సిన అవసరాన్ని కోర్టులు విస్మరించజాలవు. మహిళలపై ఎలాంటి నేరానికి పాల్పడ్డా సహించేది లేదని సమాజం అవగతం చేసుకున్నపుడు మాత్రమే మహిళలపై నేరాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి నేర న్యాయ వ్యవస్థ ప్రజల మనసుల్లో, ప్రత్యేకించి మహిళల్లో విశ్వాసాన్ని నింపి తీరాలి.’’
అత్యంత అరుదైన కేసే..!
తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మృత్యు దండన విధిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా పలు వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందకే వస్తుందని పేర్కొన్నారు. పశువుల్లా ప్రవర్తించిన దోషుల తీరు రోమాలు నిక్కబొడుచుకునే ఈ సంఘటన తీవ్రతకు అద్దంపడుతోందన్నారు.
బాధితురాలి పట్ల దోషుల అమానవీయ ప్రవర్తన అందరినీ కలచివేసిందన్నారు. దోషుల భయంకరమైన ప్రవర్తన ఈ కేసును కచ్చితంగా అరుదైన కేసుల కోవలోకి చేర్చిందన్నారు. దోషులను సమాజం ఛీదరించుకోవటం, తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తదితర అంశాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
దోషులు వీరే..
1. రామ్‌సింగ్ (34) (ప్రధాన దోషి. తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు). బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు.
2. అక్షయ్ ఠాకూర్ (28). ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు.
3. వినయ్ శర్మ (20). అసిస్టెంట్ జిమ్ ఇన్స్ట్రక్టర్
4. ముకేశ్‌సింగ్ (26). రామ్‌సింగ్ సోదరుడు. దక్షిణ ఢిల్లీలో వుురికివాడలో సోదరుడితో కలిసి జీవించాడు.
5. పవన్ గుప్తా (19). పండ్ల వ్యాపారి.
ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ) (సామూహిక అత్యాచారం) కింద కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది.
దోషులకు తెల్ల దుస్తులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులకు తీహార్ జైలు సంప్రదా యం ప్రకారం అధికారులు తెల్ల దుస్తులు అందజేశారు. దీంతో జైల్లో ఇప్పటిదాకా విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని ఇకపై దోషులుగా గుర్తిస్తారు. పవన్ గుప్తా(19), వినయ్‌శర్మ(20)లను ఏడో నెంబరు జైల్లో ఉంచగా, ముకేష్(26), అక్షయ్ ఠాకూర్(28)లను నాలుగో నెంబరు జైల్లో ఉంచారు.