న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు.
ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్‌పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఛాంద్‌బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: బెంగాల్‌లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ!
Comments
Please login to add a commentAdd a comment