Delhi Dialogue
-
ఈసారి బిజ్లీ - పానీపై ఢిల్లీ డయలాగ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే వారం నిర్వహించనున్న ‘ఢిల్లీ డయలాగ్’ మూడో దశలో బిజ్లీ (విద్యుత్), పానీ (తాగు నీరు)పై దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఇంతకుముందు యువజనులు, మహిళల అంశాలపై కేంద్రీకరించిన ఆప్ ఈసారి ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్యుత్, తాగునీటి సమస్యలపై దృష్టిని కేంద్రీకరించనున్నామని పేర్కొంది. మరోసారి ఢిల్లీలో అధికారంలోకి వస్తే నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు చార్జీలను 50 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు విద్యుత్ సరఫరా కంపెనీల ఖాతాలను కాగ్ తనిఖీ చేసేంత వరకు ఈ రాయితీని కొనసాగిస్తామని పేర్కొంది. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు చేపట్టిన ఢిల్లీ డయలాగ్ మూడో దశ కార్యక్రమాన్ని ఈ నెల 13న చేపట్టనున్నామని ఆప్ నేతలు చెప్పారు. ప్రజలతో సంభాషణల ఆధారంగా పార్టీ రూపొందించబోయే ప్రణాళికకు ‘బిజ్లీ-పానీ డయలాగ్’ నిదర్శనంగా నిలుస్తుందని ఆప్ నాయకురాలు మీరా సాన్యాల్ చెప్పారు. ఢిల్లీలో విద్యుత్, ఇంధనం, నీటి సంక్షోభం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు, సలహాలు వింటామని తెలిపారు. పునర్వినియోగ ఇంధనం, పవర్ గ్రిడ్ కంపెనీలు, విద్యుదుత్పత్తి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల, విద్యుత్ పంపిణీ, సరఫరా సంస్థలకు చెందిన నిపుణులతో తమ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఢిల్లీ డయలాగ్ సభ్యుడు వినయ్ మిట్టల్ చెప్పారు. ఢిల్లీలోని 1.7 కోట్ల జనాభాకు ప్రాథమిక ఇంధన అవసరాలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని మిట్టల్ పేర్కొన్నారు. ఢిల్లీకి 54 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 6200 మెగావాట్ల విద్యుత్ అందుతుందని, కానీ 5400 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగల సామర్థ్యం ఉందని ఆయన వివరించారు. ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ సమస్యలు, విద్య-వైద్యం, వ్యాపారుల సమస్యలు, లోక్‌పాల్, పాలనలో పారదర్శకత, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై కూడా ఢిల్లీ డయలాగ్ నిర్వహిస్తామని ఆప్ నాయకుడు ఆశిష్ ఖేతాన్ తెలిపారు. ఢిల్లీ డయలాగ్ బృందానికి ఖేతాన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ డయలాగ్ల ద్వారా వచ్చే సమాచారాన్నంతా క్రోడీకరించి తమ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఢిల్లీ డయలాగ్ కార్యక్రమం జనవరి 18న ముగుస్తుందన్నారు. -
'ఢిల్లీ డైలాగ్'... యువతతో చెలగాటం
న్యూఢిల్లీ: 'ఢిల్లీ డైలాగ్' కార్యక్రమం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) యువత భావోద్వేగాలతో ఆడుకుంటోందని బీజేపీ విమర్శించింది. ఇటువంటి కార్యక్రమాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, ఎవరి వలలోనూ పడొద్దని హెచ్చరించింది. జనతా దర్బార్ తో సహా గత మూడేళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఆప్ చేపట్టి తర్వాత చేతులెత్తేసిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీఫ్ ఉపాధ్యాయ ఆరోపించారు. సీఎం పీఠం ఎక్కిన వ్యక్తి వెనుక డోర్ నుంచి పారిపోయారని కేజ్రీవాల్ ను ఎత్తిపొడిచారు. ప్రస్తుతం నరేంద్ర మోదీని యువత తమ రోల్ మోడల్ గా భావిస్తోందని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. -
ఆప్ ‘ఢిల్లీ డయలాగ్’
ఓటర్లతో మమేకమయ్యే చర్యల్లో ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఓటర్లతో మమేకమయ్యే చర్యల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ‘ఢిల్లీ డయలాగ్’ప్రారంభించింది. ఈ కార్యమ్రం కింద తమ ఆదర్శనగరం ఎలా ఉండాలో ఢిల్లీ వాసుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. నిపుణుల నుంచి గృహస్తుల వరకు, యువత నుంచి మహిళల వరకు, సమాజంలోని వివిధ వర్గాల వారితో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని ఆప్ ఎంచుకుంది. ‘‘ప్రజల ఆకాంక్షలు ఏమిటి, తమ ఢిల్లీ ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారో తెలుసుకోగోరుతున్నాం. మేధావులు, గృహిణులు, విద్యార్థులు, యు వతీ యువకులు, మహిళలు, గ్రామస్తులు, పారిశ్రామికవేత్తలు, జేజే క్లస్టర్, అనధికార కాలనీల నివాసు లు..... ఇలా అందరినీ కలుసుకుంటాం. ఆ తరువాత ఓ 50 అంశాల కార్యక్రమాన్ని తయారు చేస్తాం. ఆ అంశాలు, సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాం’’ అని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ అంశాలను తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేరుస్తామని అన్నారు. ఢిల్లీ డయలాగ్ కార్యక్రమంలో భాగంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 15న నగరంలో ఓ భారీ సభను నిర్వహించనున్నామని, చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక దినమైన నవంబర్ 26న మహిళల భద్రత సమస్యపై ఇటువంటిదే మరో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం పార్టీ నేతలు ఆశిష్ ఖేతన్, ఆదర్శ్ శాస్త్రి, మీరా సాన్యాల్, ప్రీతీ శర్మమీనన్ వంటి నేతలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ చెప్పారు. వైద్యం, విద్య, విద్యుత్, నీటి సమస్యలపై ప్రధానంగా తాము దృష్టి కేంద్రీకరిస్తామని, నిర్దిష్ట కాల పరిమితితో వీటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆశిష్ ఖేతన్ చెప్పారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు నెలల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటులో కూడా గెలుపొందలేకపోయింది. దీంతో ఆ పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విద్యార్థి, యువజన, మహిళ, మైనారిటీ, కార్మిక సంఘాలను స్థాపించింది.