delhi people
-
ఢిల్లీ ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో జరగబోయే జీ20 సదస్సును విజయవంతం చేయాలని రాజధాని ప్రజలను మోదీ కోరారు. అయితే ఆ సమయంలో పలువురు ప్రపంచ నేతలు ఢిల్లీ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ కారణంగా రాజధాని ప్రజలకు కొంత ఇబ్బందికి గురి కావచ్చని , అందుకే ముందే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు బెంగుళూరు పర్యటన ముగించుకొని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టు వెలుపల మాట్లాడుతూ.. G20 సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల కారణంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే అసౌకర్యానికి ముందస్తుగా ప్రజలను క్షమించాలని కోరారు. దేశం మొత్తం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తోందని, కానీ అతిథులు ఢిల్లీకి వస్తున్నారన్నారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. దేశ ప్రతిష్టపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలని కోరారు. చదవండి: జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా? ‘సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు చాలా అసౌకర్యం ఉండనుంది. అతిథుల విచ్చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి మిమ్మల్ని వేరే దారిలో మళ్లిస్తారు. ఈ మార్పులు అవసరమం. ట్రాఫిక్ నిబంధనల వల్ల ఢిల్లీ వాసులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందుకు ముందుగానే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాగా సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌తో ఆహ్వానిత అతిథి దేశాలకు చెందిన 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. -
మళ్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా కమలం కలలు కల్లలేనా? దేశానికి మోదీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని ఓటర్లు ఫిక్సయిపోయారా? జాతీయవాదాన్ని అభివృద్ధి, ఉచిత పథకాల ఎజెండా అధిగమించిందా? మరోసారి ఆప్ కీ సర్కార్ అనే రాజధాని ఓటర్లు నినదించారా? కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్కే పట్టం కడతారని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే, 2015 ఎన్నికల మాదిరిగా భారీ స్థాయి మెజార్టీ రాకపోవచ్చునని అంచనా వేశాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సమీక్షించి చూస్తే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 40 నుంచి 50 స్థానాలను గెలుచుకోవచ్చునని, బీజేపీకి 10 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక చతికిలపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలను స్వీప్ చేయడం, కాంగ్రెస్ ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలవడంతో ఈసారి ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కమలదళం మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే జాతీయ భద్రత, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీర్లో 370 ఆర్టికల్ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సీఎం కేజ్రీవాల్ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. షహీన్‌బాగ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ‘మీరు గెలిస్తే సీఎం ఎవరు’అంటూ సవాల్ విసిరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు వంటివి కేజ్రీవాల్‌పై క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు పోటీకి అంగీకరించకుండా, వారి బంధువులకే టిక్కెట్లు ఇప్పించుకోవడం, గాంధీ కుటుంబం ఆఖరి నిమిషంలో తూతూ మంత్రంగా ప్రచారం చేయడం వంటివి ఆప్‌కి కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? ఢిల్లీ ప్రజల అసలైన నాడిని పట్టుకోగలిగాయా? అన్నది 11న వచ్చే ఫలితాల్లో తేలిపోనుంది. మెజారిటీ మాదే: ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఆప్ వైపే మొగ్గుచూపుతుండగా బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాత్రం.. తమ పార్టీ క్లీన్‌స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నాడిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 48 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ రానుందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను ఆయన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
50 లక్షల కేజీల టపాసులు కాల్చారు
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన ఢిల్లీ ప్రజలు సుమారు 50 లక్షల కిలోల బాణసంచా కాల్చారని సర్వేలో తేలింది. సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా కూడా గతేడాదికి సమానంగా అంత మొత్తంలో టపాసులు పేల్చడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 50 లక్షల కిలోల బాణసంచా.. సుమారు లక్షా యాభై వేల కిలోల పీఎం 2.5 కణాల ద్రవ్యరాశికి సమానం. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) దారుణంగా పడిపోయి 642కు చేరింది. దీన్ని అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిగా భావిస్తారని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సఫర్ అనే సంస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో వాయు నాణ్యత అదే స్థాయిలో కొనసాగొచ్చు. 11 రెట్ల కాలుష్యం: సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్ణీత సమాయానికి ముందు, తరువాత బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్యం అనుమతించదగిన పరిమితుల కన్నా 11 రెట్లు అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే ఎన్–99 ముసుగులు ధరించాలని వైద్యులు సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఘటనలపై 550కి పైగా కేసులు నమోదుచేసి, 300 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2500 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్న యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను అనుమతిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుందని చెప్పారు. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడటం ఒక ప్రత్యేకత కానుందని చెప్పారు. మొత్తం 50 మందిని తీసుకెళ్లే సామర్థ్యమున్న గాజు ఎలివేటర్లు నాలుగింటిని వచ్చే రెండు నెలల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం రూ.464 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 2004లో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2010లో కామన్వెల్త్ గేమ్స్ నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు సవరించిన అంచనా రూ.1,131 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2011 నుంచి వంతెన నిర్మాణంలో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. 2015 నాటికి వంతెన నిర్మాణ అంచనా వ్యయం రూ.1,594 కోట్లకు పెరిగిపోయింది. 2018 నవంబర్ 4వ తేదీకి ఎట్టకేలకు ‘సిగ్నేచర్’ కల నిజమయింది. -
మెట్రో రైలా.. అబ్బే వద్దులే!
బాగా రద్దీగా ఉండటం, అనుకున్న చోటు వరకు కనెక్టివిటీ ఉండకపోవడం, సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటం.. కూర్చోడానికి కూడా స్థలం లేకపోవడం.. ఇలాంటి కారణాలతో ఢిల్లీ మెట్రో రైలుకు చాలామంది దూరంగానే ఉంటున్నారట. కాస్త ఉన్నత ఆదాయ వర్గాలు అనుకున్నవాళ్లంతా తమ వ్యక్తిగత రవాణా సదుపాయాలనే ఉపయోగించుకుంటున్నారు తప్ప.. మెట్రో రైలు జోలికి వెళ్లట్లేదు. ఈ విషయం స్వయంగా ఢిల్లీ మెట్రోరైలు వర్గాలు నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులను ప్రశ్నించిన తర్వాత ఈ వివరాలు బయటపెట్టారు. మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువ మంది నెలకు రూ. 20-50 వేల మధ్య జీతం వచ్చేవాళ్లే ఉంటున్నారు. ప్రయాణికులలో 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం ఉన్నవాళ్లు కేవలం 9.56 శాతం మంది మాత్రమే ఉండగా, లక్ష రూపాయలకు పైన జీతం వచ్చేవాళ్లు 1.67 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. ఏసీ బోగీలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నా కూడా వీటి జోలికి పెద్దగా రావడం లేదు. వ్యక్తిగత వాహనాలనే వాడుతున్నారు. దాంతో ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఇప్పటికే కోటి దాటింది. మెట్రో రైలులో ప్రయాణించేవారిలో 18.4% మందికి సొంత వాహనాలున్నాయి. మెట్రో స్టేషన్ నుంచి మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లడానికి 20.23% మంది బస్సులు, 14.14% మంది ఈ-రిక్షాలు, 8.23% మంది ఆటోలు, 8.10% మంది రిక్షాలు, 3.45% మంది టాక్సీలు ఉపయోగించారు. 11.51% మంది నడవగా, కేవలం 14.31% మందే ఫీడర్ బస్సులను ఉపయోగించుకున్నారు. ప్రధానంగా మెట్రో రైళ్లలో పీక్ అవర్స్‌లో రద్దీ చాలా ఎక్కువగా ఉండటమే దీనివైపు మొగ్గు చూపించకపోవడానికి కారణం అవుతోంది. ఉదయం 8-11, సాయంత్రం 5-8 గంటల మధ్య పీక్ అవర్స్ ఉంటున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ మెట్రో 188 రైళ్లు నడుపుతుండగా మిగిలిన సమయంలో 174 రైళ్లు నడుపుతోంది. తాను ప్రతిరోజూ నోయిడా నుంచి గుర్గావ్ వెళ్తుంటానని, మహిళల బోగీ కూడా ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుందని, అయినా అంత దూరం ప్రతిరోజూ కారులో వెళ్లడం కష్టం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే వెళ్తున్నానని మధు తివారీ అనే ప్రయాణికురాలు చెప్పారు. మెట్రో రైళ్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నా.. కారు వాడకాన్ని పూర్తిగా ఆపేసేంత పరిస్థితి మాత్రం లేదని అమిత్ భట్ అన్నారు. 2014లో 193 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ మెట్రోరైలు నెట్వర్క్.. 2016 నాటికి 212.4 కిలోమీటర్లకు విస్తరించింది. అలాగే 2014లో రోజుకు 23.5 లక్షల మంది ప్రయాణించగా, ప్రస్తుతం 28.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. -
తాత ... రికార్డుల మోత
న్యూఢిల్లీ: ఒక్కడు...ఒకే ఒక్కడు...రికార్డుల మోత మోగిస్తున్నాడు. 1001 గంటల పాటు స్కూటర్ నడిపి ఓ రికార్డు....నాలుగు నిమిషాల్లో టమాటా కెచప్ తాగేసి మరో రికార్డు...ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు పిజ్జా డెలివరీ చేసి ఇంకో రికార్డు...దంతాల్ని పీకేసుకుని 496 స్ట్రాలు నోట్లో పెట్టుకుని ప్రపంచ రికార్డు...ఈ రికార్డులన్నీ ఓ యువకుడివి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే...ఇవన్నీ సొంతం చేసుకున్నది 74 ఏళ్ల వృద్ధుడు..అతనే ఢిల్లీకి చెందిన ప్రకాష్ రిషి... పాశ్చాత్య దేశాల్లో సరదా కోసం కొత్తగా కనిపించడం కోసం వేయించుకునే టాటూలను ఒంటిపై వేసుకుని తాజాగా మరోసారి రికార్డులకెక్కాడు. ప్రపంచ ప్రముఖులైన మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ, క్వీన్ ఎలిజబెత్, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇలా 500కు పైగా ముఖచిత్రాల్ని, 396 జాతీయ జెండాలని టాటూగా వేయించుకుని రిషి ఇటీవలే గిన్నిస్ రికార్డులకెక్కాడు. అందుకనే ఈ తాతను...రికార్డుల తాతగా ఢిల్లీ ప్రజలు పిలుస్తుంటారు. -
ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్' దేశ రాజధానిలో అందుబాటుకి వచ్చింది. తమిళనాడు భవన్లో 'అమ్మ క్యాంటిన్'లో ఒక్కరూపాయికే ఇడ్లీలు లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. పొంగల్ పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దీనితో పాటు లెమన్ రైస్ , సాంబార్ రైస్ అయిదు రూపాయలకు దొరుకుతోంది. దాంతో ఢిల్లీ వాసులు అమ్మ క్యాంటిన్లో పొంగల్ వేడుకలు జరుపుకుంటున్నారు. అమ్మ క్యాంటిన్ ధరలు ఆకర్షించటంతో...వారు పెద్ద ఎత్తున తమిళనాడు భవన్‌కు చేరుకుని పొంగల్, ఇడ్లీ రుచి చూస్తున్నారు. కాగా కేవలం మూడు రోజుల మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.