delivery boy killed
-
అదే దారుణం: బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. డెలివరీ ఏజెంట్ మృతి
లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్‌ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న కౌషల్‌గా గుర్తించారు. నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్. నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్ సోదరుడు అమిత్ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌ను సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. -
విప్రో జంక్షన్లో టిప్పర్ బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్‌లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌లోని విప్రో జంక్షన్లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్‌లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్‌ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్‌లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్‌లోని ఓ సైట్లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్లో అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్‌కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్‌లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్‌లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు.. యమహా బైక్‌పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్‌పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. టిప్పర్‌లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లు సురక్షితం.. నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్.. టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు. -
ఫోను కోసం.. గొంతుకోసి చంపేశాడు!
ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ చేసి.. దానికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో డెలివరీ బోయ్ని చంపేశాడో వ్యక్తి. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్న నంజుండస్వామి (29)ని కె. వరుణ్‌కుమార్ (22) అనే జిమ్ ట్రైనర్ గొంతు కోసి హతమార్చాడు. బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలో గల ఓ భవనం లిఫ్టు షాఫ్టులో అతడి మృతదేహం పడి ఉంది. పది రోజుల క్రితమే జిమ్‌లో చేరిన వరుణ్ వద్ద అప్పటి వరకు ఫోన్ లేదు. కానీ అతడి స్నేహితులు, క్లయింట్లు అందరివద్ద మంచి ఫోన్లున్నాయి. మెకానిక్‌గా పనిచేసే తన తండ్రిని అతడు డబ్బులు కావాలని అడిగినా, తనవద్ద అంత లేదని ఇవ్వలేదు. అప్పుడే ఉద్యోగంలో చేరడంతో వరుణ్ వద్ద కూడా డబ్బులు లేవు. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత తనను డబ్బులు అడగడం సరికాదని అతడి తండ్రి చెప్పారు. చేతిలో డబ్బులు లేకపోయినా, రెడ్మి నోట్ 3 ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసి, తన జిమ్ ల్యాండ్‌లైన్ నంబరు ఇచ్చాడు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నంజుండ స్వామి డెలివరీ తీసుకుని రాగా, అతడిని సెకండ్ ఫ్లోర్‌లోకి వరుణ్ పిలిచాడు. అతడి వద్ద నుంచి ఫోన్ లాక్కోడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎలాగోలా తప్పించుకుని బయటకు పారిపోయాడు. దాంతో వరుణ్ వెనక నుంచి ఒక ఫ్లవర్ వాజ్‌తో అతడి తలమీద కొట్టగా, స్వామి స్పృహతప్పి పడిపోయాడు. దాంతో అతడి గొంతును ఓ కత్తితో కోసేశాడు. దాదాపు పదిగంటల పాటు శవాన్ని అలాగే వదిలేసి, తర్వాత లిప్టు షాఫ్ట్‌లో పారేశాడు. అతడి వద్ద ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు పదివేల రూపాయల నగదు, డెలివరీ కోసం తెచ్చిన ఇతర వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వాటిలో రెడ్మి ఫోన్‌ను తాను వాడుతూ, రూ. 24వేల విలువైన హెచ్‌టీసీ ఫోన్‌ను మరో స్నేహితుడికి ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత స్వామి తండ్రి తన కొడుకు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి పోలీసులు స్వామి మృతదేహాన్ని కనుగొన్నా.. అది అతడిదని తొలుత తెలియలేదు. తర్వాత ఫ్లిప్‌కార్ట్ వారిని సంప్రదించగా, జిమ్‌లో డెలివరీకి వెళ్లిన తర్వాత నుంచి అతడి ఆచూకీ లేదని చెప్పారు. వరుణ్ జిమ్ తీయడం లేదని తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేసి విచారించగా మొత్తం విషయం బయటపడింది.