సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్‌లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌లోని విప్రో జంక్షన్‌లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్‌లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్‌ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్‌లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్‌వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్‌లోని ఓ సైట్‌లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్‌లో అన్‌లోడ్ చేసేందుకు బయలుదేరింది.
ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్‌కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్‌లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్‌లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు..
యమహా బైక్‌పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్‌పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. టిప్పర్‌లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీళ్లు సురక్షితం..
నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్..
టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్‌వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్‌లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment