Democratic country
-
విధిగా ఓటేసేలా చట్టం రావాలి: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘మనకు నచ్చిన.., ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ప్రజాస్వామ్య దేశంలోనే సాధ్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేయాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో వంద మీటర్ల ఈవీఎం పెయింటింగ్‌ను వేశారు. వంద మీటర్ల జాతీయ పతాకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. వయోజనులందరూ కలసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిపాలన అందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మహాత్మాగాంధీ కలలు కన్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్యానికి విఘాతం వంటిదని అన్నారు. ఎంత ఎక్కు వ మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటే.. అంత మంచి పాలకులు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
85% భారతీయులకు ప్రభుత్వంపై నమ్మకం
వాషింగ్టన్: భారత్‌లో ఐదింట నాలుగొంతుల మందికి తమ ప్రభుత్వంపై విశ్వాసముందని, అయితే ఆసక్తికరంగా.. అధిక శాతం భారతీయులు సైనిక పాలన, నియంతృత్వానికి కూడా మద్దతిస్తున్నారని తాజా ‘ప్యూ’ సర్వే పేర్కొంది. భారత్‌లో 2012 నుంచి ఆర్థిక వృద్ధి రేటు సరాసరి 6.9 శాతం చొప్పున పెరుగుతుందని, ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రభుత్వంపై నమ్మకముందని 85 శాతం ప్రజలు చెప్పారని తన నివేదికలో వెల్లడించింది. ఏడు దశాబ్దాలుగా బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 55% ప్రజలు ఏదో ఒక రూపంలో నియంతృత్వానికి మద్దతు తెలిపారని, 27% మంది బలమైన నేత అవసరముందని చెప్పారంది. -
ఓటు వేస్తేనే.. బంగారు భవిష్యత్తు..!
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎంతో విలువైనది. ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది ఓటర్లే. ప్రజాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంలో జిల్లాలోని ఓటర్లు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో పోలింగ్ శాతం పడిపోయి మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని చేజేతులా మనం జారవిడుచుకుంటున్నాం. గత మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 4,35,886 సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరిగే అవకాశం ఉంది. అయితే వజ్రాయుధం వంటి ఓటు హక్కు వినియోగించుకోవడంపై కొందరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఓటరుగా నమోదు చేసుకోవటంలో చూపుతున్న ఆసక్తి ఓటు వేయటంలో చూపడం లేదు. ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనైనా ఓటర్లందరు ఓటు వేస్తారని ఆశిద్దాం. ఓటు హక్కుపై ప్రచారం ఈనెల 30 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని వారు సార్వత్రిక ఎన్నికల్లో అయినా ఓటు వేసేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ భావి స్తోంది. ఇందులో భాగంగానే గ్రామ గ్రామన, జనావాసాల చోట్ల విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పోల్ చిట్టీలను ఇంటింటికి పంపిణీ చేస్తోంది. అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి కమిటీలను ఏర్పాటు చేసి, ఓటర్లతో ప్రతిజ్ఞలు చేయిస్తోంది. నోటా మీటా నొక్కండి.. ఓటరు జాబితాలో పేరుంటే చాలు ఓటు వేయొ చ్చు. ఎన్నికల సంఘం సూచించిన 16 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లాలి. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థి నచ్చకు న్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓటరు ఇష్టం లేకున్నా ఏదో ఓ అభ్యర్థికి ఓటు వేసేవారు. ఈసారి అభ్యర్థి నచ్చకుంటే తిరస్కరించేందుకు ‘నోటా’ మీటను ప్రవేశపెట్టారు. మంచి నాయకుడని భావిస్తే ఆ నాయకుడికి కేటాయించిన గుర్తుకు ఓటు వేయవచ్చు. పోటీలో నిలబడిన వారిలో ఏ ఒక్కరూ నచ్చకుంటే ‘నోటా’ బటన్ నొక్కితే చాలు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ వివరిస్తోంది. ప్రజలను చైతన్య వంతులను చేస్తోంది. పోల్ చీటీలు అందిస్తే చాలు.. జిల్లాలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటర్లకు ప్రభుత్వ యంత్రాంగమే పోలింగ్ చీటీలను పంపిణీ చేసింది. గతంలో అభ్యర్థులే ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేసే వారు. దీంతో పోలింగ్ కేంద్రంలో 70-80 శాతం వరకు పోలింగ్ శాతం నమోదయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఓటర్ల జాబితాలో సరైన చిరునామాలు లేకపోవడంతో అందరికీ పోలింగ్ చీటీలు అందలేదు. కొంత మందికి పోలింగ్ చీటీలు అందినా పోలింగ్ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు. కనీసం పోలింగ్ రోజైనా ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల బూత్‌ల వద్ద ఓటర్లకు పోలింగ్ చీటీలు అందక చాలా మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అలా జరుగకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశముంది. -
ఓటేద్దాం..రండి!
సాక్షి, కరీంనగర్ : ప్రజాస్వామ్య దేశంలో పౌరుల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. అది పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. కుళ్ల రాజకీయాలను కూలదోసి, స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలకులను గద్దెనెక్కించే ఆయుధం. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటుహక్కును ఎంతమంది బాధ్యతగా వినియోగించుకుంటున్నారంటే.. మన జిల్లాలో సగటున నూటికి 70శాతం. ప్రతి ఎన్నికల్లో ఇంచుమించు ఇదే స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా.. ప్రత్యేక ఓటరు నమోదు, చైతన్య కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించినా ఆశించినంత ఫలితం రావడంలేదు. గ్రామీణ ప్రాంత ఓటర్లకంటే.. విద్యావంతులైన పట్టణ ఓ టర్లే ఓటుహక్కును వినియోగించుకునేందుకు బద్ధకిస్తుండటం విచారకరం. గతనెల 30న జరి గిన మున్సిపల్, ఈ నెల 6న జరిగిన తొలివిడత ప్రాదేశిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. గతనెల 30న జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 7,10,654 మంది ఓటర్లుండ గా, 5,35,950 మంది మాత్రమే తమ ఓటును వినియోగించుకున్నారు. 1,74,704 మంది ఓ టుకు దూరమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 2,28,856 ఓటర్లుండగా 1,36,400 మంది మాత్రమే ఓటేశారు. 92,450 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు పదివేల మంది అనుకున్నా.. స్థానికంగా ఉన్నవారూ ఓటేసేందుకు ముందుకురాకపోవడం గమనార్హం. రామగుండం కార్పొరేషన్‌తోపాటు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, జమ్మికుంట, వేములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్ నగర పంచాయతీల్లో వేలాది మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఈ నెల 6న పెద్దపల్లి, జగిత్యాల, మంథని రెవెన్యూ డివిజన్లలో జరిగిన తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 2,24,534 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. మొత్తం 10,17,238 మంది ఓటర్లుండగా.. 7,92,704 మంది మాత్రమే ఓటేశారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల పరిచయాలు ఎక్కువే. తమ గెలుపు కోసం ఓటర్లను చైతన్యపర్చాల్సిన అభ్యర్థులు కూడా ఎంతో కష్టపడ్డారు. అయినా ఆశించిన మేర పోలింగ్ జరగకపోవడం గమనార్హం. ఫలితమివ్వని ప్రచారం.. దాదాపు నాలుగు నెలల నుంచి.. ‘అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటేయడం మరవొద్దు.. ఓటు లేని వారు దరఖాస్తు చేసుకోండి..’ అని విస్తృతంగా ప్రచారం చేసిన అధికారులు.. ఓటుహక్కు దరఖాస్తుకు గడువుల మీద గడువులిచ్చిన ఎన్నికల సంఘం లక్ష్యం జిల్లాలో నెరవేరలేదు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోపాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు పలుమార్లు అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా మంది యువత కొత్తగా ఈసారి ఓటుహక్కు పొందారు. వీరితో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లోని ఓటర్లందరితో ఓటు వేయించేందుకు వారిని చైతన్యపరుస్తున్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా.. ఎవరికీ భయపడకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అధికారులు కూడా పల్లెల్లో, మండల కేంద్రాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ఓటు విలువను వివరిస్తున్నారు. అయినా ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుకు దూరంగా ఉండడం గమనార్హం. రండీ.. ఓటేద్దాం..! పాశుపతాస్త్రమైన ఓటు హక్కు వినియోగించుకోకపోతే అందరి కంటే ముందు నష్టపోయేదీ మనమే అని మరిచిపోవద్దు. మన ఓటు ఓ అభ్యర్థిని ఓడించడంతో పాటు గెలిపించగలదని గుర్తుంచుకోవాలి. ఒకరిపై ఉన్న వ్యతిరేకతతో ఇతరులకు ఓటేయకపోతే మంచి భావాలున్న మరో వ్యక్తి ఓడిపోయే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అర్హుడైన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలని మేధావులు కోరుతున్నారు.