ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎంతో విలువైనది. ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది ఓటర్లే. ప్రజాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంలో జిల్లాలోని ఓటర్లు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో పోలింగ్ శాతం పడిపోయి మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని చేజేతులా మనం జారవిడుచుకుంటున్నాం. గత మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 4,35,886 సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు.
దీని వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరిగే అవకాశం ఉంది. అయితే వజ్రాయుధం వంటి ఓటు హక్కు వినియోగించుకోవడంపై కొందరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఓటరుగా నమోదు చేసుకోవటంలో చూపుతున్న ఆసక్తి ఓటు వేయటంలో చూపడం లేదు. ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనైనా ఓటర్లందరు ఓటు వేస్తారని ఆశిద్దాం.
ఓటు హక్కుపై ప్రచారం
ఈనెల 30 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని వారు సార్వత్రిక ఎన్నికల్లో అయినా ఓటు వేసేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ భావి స్తోంది. ఇందులో భాగంగానే గ్రామ గ్రామన, జనావాసాల చోట్ల విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పోల్ చిట్టీలను ఇంటింటికి పంపిణీ చేస్తోంది. అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి కమిటీలను ఏర్పాటు చేసి, ఓటర్లతో ప్రతిజ్ఞలు చేయిస్తోంది.
నోటా మీటా నొక్కండి..
ఓటరు జాబితాలో పేరుంటే చాలు ఓటు వేయొ చ్చు. ఎన్నికల సంఘం సూచించిన 16 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లాలి. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థి నచ్చకు న్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓటరు ఇష్టం లేకున్నా ఏదో ఓ అభ్యర్థికి ఓటు వేసేవారు. ఈసారి అభ్యర్థి నచ్చకుంటే తిరస్కరించేందుకు ‘నోటా’ మీటను ప్రవేశపెట్టారు. మంచి నాయకుడని భావిస్తే ఆ నాయకుడికి కేటాయించిన గుర్తుకు ఓటు వేయవచ్చు. పోటీలో నిలబడిన వారిలో ఏ ఒక్కరూ నచ్చకుంటే ‘నోటా’ బటన్ నొక్కితే చాలు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ వివరిస్తోంది. ప్రజలను చైతన్య వంతులను చేస్తోంది.
పోల్ చీటీలు అందిస్తే చాలు..
జిల్లాలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటర్లకు ప్రభుత్వ యంత్రాంగమే పోలింగ్ చీటీలను పంపిణీ చేసింది. గతంలో అభ్యర్థులే ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేసే వారు. దీంతో పోలింగ్ కేంద్రంలో 70-80 శాతం వరకు పోలింగ్ శాతం నమోదయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఓటర్ల జాబితాలో సరైన చిరునామాలు లేకపోవడంతో అందరికీ పోలింగ్ చీటీలు అందలేదు. కొంత మందికి పోలింగ్ చీటీలు అందినా పోలింగ్ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు. కనీసం పోలింగ్ రోజైనా ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల బూత్‌ల వద్ద ఓటర్లకు పోలింగ్ చీటీలు అందక చాలా మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అలా జరుగకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశముంది.
ఓటు వేస్తేనే.. బంగారు భవిష్యత్తు..!
Published Fri, Apr 25 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
Advertisement
Advertisement