మూడు దశల్లో ముగిసిన మహాపోరు | Fighting ended in state of general elections | Sakshi
Sakshi News home page

మూడు దశల్లో ముగిసిన మహాపోరు

Published Thu, Apr 24 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

Fighting ended in state of general elections

 సాక్షి, ముంబై: రాష్ట్రంలో సార్వత్రిక పోరు ముగిసింది. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు జరగగా, గురువారం మూడో దశ ఎన్నికల ఘట్టం ముగిసింది. చెదురుముదురు సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిశాయి. అయితే గత రెండు దశల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. మొదటి, రెండు దశల్లో వరుసగా 55 శాతం, 62.36 శాతం నమోదైన పోలింగ్ ఈసారి సుమారు 55.57 శాతానికి మాత్రమే పరిమితమైంది. ‘అత్యధికంగా నందుర్బార్, రాయిగఢ్‌లలో 62 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా భివండీ కళ్యాణ్, భివండీలలో వరుసగా 42, 43 శాతం మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని ఆరు లోకసభ నియోజకవర్గాలలో సుమారు 53 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.

 ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. భారీ భద్రత మధ్య జరిగిన తుది దశ ఎన్నికల్లో మొత్తం 338 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో మిలింద్ దేవరా,  గురుదాస్ కామత్, మేధా పాట్కర్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే, మాణిక్‌రావ్ గావిత్, బాలా నాందగావ్కర్, మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కూతురు హీనా గావిత్, సంజీవ్ నాయక్, శివసేన నాయకుడు అనంత్ గీతే తదితర ప్రముఖులున్నారు.  మొదటి దశలో రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలు, రెండో దశలో 19, తుది దశలో 19 లోకసభ  స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

 పోలింగ్‌పై భానుడి ప్రభావం
 ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ కొంత మెరుగ్గా కనిపిం చింది. మధ్యాహ్నం మందకొడిగా సాగింది. భానుడి ప్రభావం పోలింగ్‌పై పడింది. ఎండవేడిమికి ఓటర్లు కేంద్రాలకు రావడానికి వెనుకడుగు వేశారు.

 ఓటేసిన సెలబ్రిటీలు
 బాలీవుడ్ తారలు, బుల్లితెర నటులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సాధారణ ఓటర్ల మాదిరిగానే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాలిహిల్స్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్,  భార్య కిరణ్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జుహూలోని జుమనాబాయి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు. షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, బాబీ డియోల్, రాహుల్ బోస్, మిలింద్‌సోమన్, విద్యా బాలన్, నేహా దూపియా, దియా మిర్జా, శిల్పాశెట్టి, సోనం కపూర్‌లు వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అనంతరం వారందరు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఉదయం 7.15 గంటలకే ఓటు వేశారు. గోద్రేజ్ చెర్మైన్ ఆది గోద్రేజ్, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుందతి భట్టచార్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

 ప్రముఖుల పేర్లు గల్లంతు...
 ఓటర్ల లిస్ట్‌లో ఈసారి కూడా అనేక మంది పేర్లు తప్పులు దొర్లగా, మరికొందరి పేర్లు జాబితాలోనే కనిపించలేదు. అనేక మంది తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే నిరాశతో వెనుదిరిగారు. హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పారేఖ్ పేరు ఓటర్ లిస్ట్‌లో లేదని తెలిసింది. దీంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లిన ఆయన ఓటు వేయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

 ముంబైలో తొలిసారి ఓటేసిన పవార్
 దిగ్గజ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎవరికి వారే తాము గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్  లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ముంబై నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి ముందు ఆయన బారామతిలో ఓటు వేసేవారు. అయితే ముంబై క్రికెట్ అసొసియేషన్ ఎన్నికల సందర్బంగా ఆయన తన  చిరునామాను బారామతి నుంచి ముంబైకి మార్చుకున్నారు. దీంతో ఆయన పేరు బారామతి ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించి ముంబైలో అధికారులు చేర్చారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని తాడ్‌దేవ్ ఏసీ మార్కెట్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బాంద్రాలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దాదర్‌లోని పోలింగ్ కేంద్రంలో మహారాష్ట్ర నవ నిర్మాణసేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే, మిలింద్ దేవరా, మేధా పాట్కర్, ఏక్‌నాథ్ గైక్వాడ్, కిరీట్ సోమయ్య, గురుదాస్ కామత్, ప్రియాదత్, గోపాల్ శెట్టి. బాలా నాందగావ్కర్, రాహుల్ శెవాలే, అనీల్ సావంత్, పూనం మహాజన్ ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఠాణే జిల్లాలో గణేష్ నాయక్, ఏక్‌నాథ్ షిండే, సంజీవ్ నాయక్, రాజన్ విచారే, చింతామణి వన్‌గా, బలిరాం జాదవ్, ఆనంద్ పరాంజ్‌పే ఓటేశారు. నాసిక్ జిల్లాలో ఛగన్ భుజ్‌బల్ భార్య మీనా ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement