Department of AYUSH
-
‘యోగా’లో ఓంపై రగడ
♦ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ముస్లిం సంఘాలు, విపక్షాలు ♦ మంత్రోచ్ఛారణ తప్పనిసరి కాదన్న ఆయుష్ శాఖ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ఇందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా ‘ఓం’తోపాటు పలు వేదమంత్రాలు ఉచ్ఛరించాలని చెప్పారంటూ ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. యోగా చేసే ముందు దీని ఫలితాలు వచ్చేందుకు ప్రార్థన (వేద మంత్రాలతో)చేయాలంటూ ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. జూన్ 21న యోగా సందర్భంగా ఈ నియమాలు పాటించాలంటూ.. విద్యాసంస్థలు, వర్సిటీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ముస్లిం మత పెద్దలు, విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం దేశానికున్న సెక్యులర్ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ‘ఓం, ఇతర వేదమంత్రాలను పఠించటం ఒక మతానికి సంబంధించినవి. వీటిని అందరికీ ఆపాదించటం సరికాదు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం. ఇది మా విశ్వాసానికి పూర్తి వ్యతిరేకం. దేశం మొత్తాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చే ప్రయత్నాన్ని సహించం’ అని ముస్లిం మతపెద్ద షఫీక్ ఖ్వాజ్మీ అన్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి కూడా ఆయుష్ ప్రకటనను విమర్శించారు. ‘ఓం’ తప్పనిసరేం కాదు: ఆయుష్ విపక్షాలు, ముస్లిం మత పెద్దలనుంచి వస్తున్న విమర్శలతో ఆయుష్ శాఖ వెనక్కు తగ్గింది. జూన్ 21న యోగా ప్రదర్శనలో భాగంగా ‘ఓం’ మంత్రాన్ని ఉచ్ఛరించటం తప్పనిసరేం కాదని.. స్వచ్ఛందమేనని ప్రకటించింది. నచ్చనివారు మంత్ర ఉచ్ఛారణ బదులు మౌనంగా ఉన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తెలిపింది. విపక్షాల ఆందోళనపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ‘మంత్రోచ్ఛారణ యోగాలో భాగం. దీన్ని వివాదం చేయటం సరికాదు. అయితే నచ్చనివారూ ఈ మంత్రాన్ని పలకాల్సిందే అని ఒత్తిడి లేదే’ అని ఖేర్ అన్నారు. -
పాఠ్యాంశంగా యోగా
రాష్ట్రాలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేసి, పాఠ్యాంశంగా చేర్చాలని రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. రానున్న విద్యా సంవత్సరంలోనే ఈ కోర్సు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. ‘స్కూళ్లలో యోగా తప్పనిసరి చేయాలని సూచిస్తూ మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. రాబోయే విద్యా సంవత్సరంలోనే ఇది ప్రారంభమవుతుందని భావిస్తున్నా. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ తరగతులుంటాయి. లేదంటే అదే పీరియడ్లో ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది’ అని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా నాయక్ బదులిచ్చారు. పోలీసు, రక్షణ సిబ్బందికి కూడా యోగా తప్పనిసరి చేశామన్నారు. అందుకు ‘పోలీసు సిబ్బందికి యోగా శిక్షణ’ కార్యక్రమాన్ని కూడా మంత్రిత్వ శాఖ రూపొందించిందన్నారు. -
ఆయుష్లో 391 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 391 మంది వైద్యులు, నర్సింగ్.. ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, నేచురోపతిల్లో మెడికల్ ఆఫీసర్లను, కాంపౌండర్లను భర్తీ చేస్తారు. అలాగే యోగా శిక్షకులను, నర్సింగ్, స్వీపర్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద వీటిని భర్తీ చేస్తారు. వీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఆయుర్వేద వైద్యులకు బీఏఎంఎస్, హోమియోపతి వైద్యులకు బీహెచ్ఎంఎస్, యునాని వైద్యులకు బీఎన్వైఎస్లలో అర్హత ఉండాలని సర్కారు స్పష్టం చేసింది. కాంపౌండర్ పోస్టులకు వచ్చే అభ్యర్థులు సైన్స్ గ్రూపులో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల అభ్యర్థులకు స్థానిక భాషలో రాయడం, చదవడ ం వస్తే సరిపోతుంది. అయితే వీటి భర్తీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయడంలో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ప్రత్యేక మార్గదర్శకాలు అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటిని భర్తీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇదిలావుంటే ఎన్ఆర్హెచ్ఎం కింద గతంలో నియమితులైన డాక్టర్లకు వేతన స్కేలు రూ. 18,100 ఉండగా... కొత్త పీఆర్సీ ప్రకారం రూ. 37,100 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పేస్కేలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.