
‘యోగా’లో ఓంపై రగడ
♦ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ముస్లిం సంఘాలు, విపక్షాలు
♦ మంత్రోచ్ఛారణ తప్పనిసరి కాదన్న ఆయుష్ శాఖ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ఇందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా ‘ఓం’తోపాటు పలు వేదమంత్రాలు ఉచ్ఛరించాలని చెప్పారంటూ ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. యోగా చేసే ముందు దీని ఫలితాలు వచ్చేందుకు ప్రార్థన (వేద మంత్రాలతో)చేయాలంటూ ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. జూన్ 21న యోగా సందర్భంగా ఈ నియమాలు పాటించాలంటూ.. విద్యాసంస్థలు, వర్సిటీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ముస్లిం మత పెద్దలు, విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.
కేంద్రం దేశానికున్న సెక్యులర్ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ‘ఓం, ఇతర వేదమంత్రాలను పఠించటం ఒక మతానికి సంబంధించినవి. వీటిని అందరికీ ఆపాదించటం సరికాదు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం. ఇది మా విశ్వాసానికి పూర్తి వ్యతిరేకం. దేశం మొత్తాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చే ప్రయత్నాన్ని సహించం’ అని ముస్లిం మతపెద్ద షఫీక్ ఖ్వాజ్మీ అన్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి కూడా ఆయుష్ ప్రకటనను విమర్శించారు.
‘ఓం’ తప్పనిసరేం కాదు: ఆయుష్
విపక్షాలు, ముస్లిం మత పెద్దలనుంచి వస్తున్న విమర్శలతో ఆయుష్ శాఖ వెనక్కు తగ్గింది. జూన్ 21న యోగా ప్రదర్శనలో భాగంగా ‘ఓం’ మంత్రాన్ని ఉచ్ఛరించటం తప్పనిసరేం కాదని.. స్వచ్ఛందమేనని ప్రకటించింది. నచ్చనివారు మంత్ర ఉచ్ఛారణ బదులు మౌనంగా ఉన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తెలిపింది. విపక్షాల ఆందోళనపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ‘మంత్రోచ్ఛారణ యోగాలో భాగం. దీన్ని వివాదం చేయటం సరికాదు. అయితే నచ్చనివారూ ఈ మంత్రాన్ని పలకాల్సిందే అని ఒత్తిడి లేదే’ అని ఖేర్ అన్నారు.