ఆయుష్ విభాగంలో 391 మంది వైద్యులు, నర్సింగ్.. ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 391 మంది వైద్యులు, నర్సింగ్.. ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, నేచురోపతిల్లో మెడికల్ ఆఫీసర్లను, కాంపౌండర్లను భర్తీ చేస్తారు. అలాగే యోగా శిక్షకులను, నర్సింగ్, స్వీపర్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద వీటిని భర్తీ చేస్తారు. వీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఆయుర్వేద వైద్యులకు బీఏఎంఎస్, హోమియోపతి వైద్యులకు బీహెచ్‌ఎంఎస్, యునాని వైద్యులకు బీఎన్‌వైఎస్‌లలో అర్హత ఉండాలని సర్కారు స్పష్టం చేసింది.
కాంపౌండర్ పోస్టులకు వచ్చే అభ్యర్థులు సైన్స్ గ్రూపులో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల అభ్యర్థులకు స్థానిక భాషలో రాయడం, చదవడ ం వస్తే సరిపోతుంది. అయితే వీటి భర్తీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయడంలో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ప్రత్యేక మార్గదర్శకాలు అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటిని భర్తీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇదిలావుంటే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద గతంలో నియమితులైన డాక్టర్లకు వేతన స్కేలు రూ. 18,100 ఉండగా... కొత్త పీఆర్‌సీ ప్రకారం రూ. 37,100 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పేస్కేలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.