రోహిత్ మృతిపై న్యాయ కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనానికి న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిషన్ మూడు నెలల్లోగా నివేదిక అందజేస్తుందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్డీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ ఆత్మహత్యపై ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, వర్సిటీ ప్రాంగణాల్లో ఎలాంటి వివక్షకు తావులేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది.
ఇందుకు వర్సిటీల వైస్ చాన్స్లర్లు, విశ్వవిద్యాలయాల్లోని సీనియర్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శనం చేయనుంది. ‘‘ఇటీవల సెంట్రల్ వర్సిటీలో జరిగిన పరిణామాల క్రమం, అందుకు దారితీసిన పరిస్థితులను న్యాయ కమిషన్ అధ్యయనం చేస్తుంది. ఇక ముందు ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది’’ అని హెచ్ఆర్డీ శాఖ తన ప్రకటనలో వివరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అణగారిన విద్యార్థుల సమస్యల పరిష్కారం, వర్సిటీ ప్రాంగణాల్లో వివక్షకు తావు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలపై త్వరలోనే దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు, వాటిలో పనిచేసే సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా ఒక చార్టర్ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్ ఐఐటీలో అనుసరిస్తున్న పీర్ గ్రూప్ అసిస్టెడ్ లెర్నింగ్(పీఏఎల్) విధానాన్ని దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఈ విధానంలో సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన విద్యార్థులకు విద్యాపరంగా సాయం అందించడంతోపాటు వారు సవాళ్లను ఎదుర్కొని నిలబడేందుకు వీలుగా ప్రత్యేకంగా మెంటార్లను ఏర్పాటు చేస్తారు.