Department of Petroleum
-
చమురు బిల్లు తడిసి మోపెడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ – 2022 మార్చి) ముడి చమురు దిగుమతుల బిల్లు 125 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) దాటిపోనుంది. క్రితం ఆర్థిక సంవత్సరం బిల్లుతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల గరిష్టాలకు చేరడంతో దిగుమతులపై మరింత మొత్తం వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో చమురు దిగుమతుల కోసం వెచ్చించిన మొత్తం 110 బిలియన్ డాలర్లుగా ఉంది. పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క జనవరిలోనే ముడి చమురు కోసం 11.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 జనవరిలో ఈ మొత్తం 7.7 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు ధరలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో చమరు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 110 డాలర్ల వరకు వెళ్లడం తెలిసిందే. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దిగుమతి చేసుకున్న చమురును ఆయిల్ కంపెనీలు రిఫైనింగ్ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్‌గా మారుస్తాయి. మన దేశానికి సంబంధించి రిఫైనింగ్ సామర్థ్యం మిగులు ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నాం. ఎల్పీజీని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులదీ అదే పరిస్థితి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 33.6 మిలియన్ టన్నులుగా ఉంది. వీటి విలువ 19.9 బిలియన్ డాలర్లు. అదే కాలంలో 33.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 51.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు నమోదయ్యాయి. భారత్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు కోసం 62.2 బిలియన్ డాలర్లను (196.5 మిలియన్ టన్నులు) ఖర్చు చేసింది. కరోనా కారణంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లాభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులు జనవరి చివరికి 175.9 మిలియన్ టన్నులు దాటిపోవడం గమనార్హం. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో 227 మిలియన్ టన్నుల ముడి చమురును నికరంగా దిగుమతి చేసుకున్నాం. ఇందుకోసం చేసిన ఖర్చు 101.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు పెరిగిపోతే అది స్థూల ఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. దేశీయంగా తగ్గిన చమురు ఉత్పత్తి దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగకపోగా, ఏటా క్షీణిస్తూ వస్తోంది. ఇది కూడా దిగుమతులు పెరిగేందుకు దారితీస్తోంది. 2019–20లో 30.5 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. 2020–21లో ఇది 29.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు చేసిన ఉత్పత్తి 23.8 మిలియన్ టన్నులుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఉత్పత్తి 24.4 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఎల్ఎన్జీ దిగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరకు 9.9 బిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. స్టోరేజీ నుంచి సరఫరాలు.. ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చమురు శాఖ తాజాగా పేర్కొంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ భయాల నేపథ్యంలో సరఫరా అవాంతరాలు, తదితర సవాళ్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో అవసరమైతే ధరలు తగ్గేందుకు వీలుగా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు దాదాపు 110 డాలర్లవరకూ ఎగసిన విషయం విదితమే. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ దాడుల కారణంగా సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలు ప్రభావం చూపాయి. రష్యాపై పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ దేశాలలో సరఫరా మార్గాలకు అవాంతరాలు లేకుంటే æచమురు ధరల తీవ్రత నెమ్మదించే వీలుంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను నిరోధించేందుకు భారత్ తగిన చర్యలు సైతం చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అమెరికా, జపాన్ బాటలో గతేడాది నవంబర్‌లో వ్యూహాత్మక నిల్వల నుంచి భారత్ 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. తీవ్ర ధరల నేపథ్యంలో ఎన్నికలు పూర్తవడంతోనే ధరలు రూ.10 వరకూ పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నిరాటంకంగా రష్యన్ వజ్రాల సరఫరా: జీజేఈపీసీ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లు అందరికీ వజ్రాలను నిరాటంకంగా సరఫరా చేస్తామని రష్యాకు చెందిన డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసా భరోసా ఇచ్చింది. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా ఈ విషయం తెలిపారు. అల్రోసా ఉత్పత్తి చేసే మొత్తం రఫ్ డైమండ్‌లో దాదాపు 10 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపారం యథాప్రకారంగానే కొనసాగుతోందని, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫిబ్రవరి 28న జీజేఈపీసీకి అల్రోసా నుంచి లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెట్రో ఆదాయం 3.35 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రానికి రూ.3,35,746 కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ లోక్‌సభకు తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.90, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచడంతో ఒక్క ఏడాదిలోనే 88 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈమేరకుసమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2019 ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ రూ.77.26, డీజిల్ రూ.71.81, ఎల్పీజీ రూ.762 ఉండగా, ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, ఎల్పీజీ రూ.887కు చేరుకున్నాయని తెలిపారు. -
ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదు: మొయిలీ
పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ న్యూఢిల్లీ: వంటగ్యాస్(ఎల్పీజీ)పై సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తేల్చిచెప్పేంత వరకు కార్డు తప్పనిసరి కాదని బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. ‘ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే. సుప్రీంకోర్టు ఏదో ఒకటి స్పష్టంగా తేల్చేవరకు దీన్ని తప్పనిసరి చేయం’ అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం తెలిసిందే.