దేవరకద్ర ఎమ్మెల్యేకు సొంత పార్టే సమస్య కానుందా?
మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పున: వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇందులో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి.
వర్గపోరు కలిసివచ్చినా.. ప్రభుత్వ వ్యతిరేకతే సమస్య
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ప్రతిసారి ఆయనకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు కలిసి వస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఇదే తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యే ఉన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చాలా వరకు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేపై కంటే మండల నేతల వ్యవహారంపైనే ఓటర్లు గుర్రుగా ఉన్నారు. పెద్దవాగు, ఊకచెట్టువాగు పై దాదాపు 18 చెక్ డ్యాంల నిర్మాణం చేయించారు.
ఎన్నో ఏళ్లుగా వర్నె-ముత్యాలంపల్లి మధ్య వాగులో వంతెన లేక జనాలు వర్షాకాలం అనేక కష్టాలు పడేవారు. ఆ వంతెన మంజూరు చేయించి పనులు చేపట్టడంతో నాలుగైదు గ్రామాల ప్రజల సమస్య తీరుతుంది. కానీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారనుంది. శంకర సముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి అయినా పునరావాసం కొలిక్కిరాకపోవడంతో ఆయకట్టుకు నీరందించటం లేదు. దీంతో పెద్దమందడి, అడ్డాకుల మండలాల ప్రజలు సాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. మండలస్దాయిలో పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివేన రిజర్వాయర్ నీటిరాక ఆలస్యం కావటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దేవరకద్రకు వందపడకల ఆస్పత్రి మంజూరు కాకపోవటం ఇబ్బందిగా ఉంది.
కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి
కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018లో డోకూర్ పవన్ కుమార్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. అవే అప్పట్లో పవన్ కుమార్ ఓటమికి కారణమైంది. ఆ సెగ్మెంట్లో న్యాయవాది మధుసూదన్ రెడ్డి( జీఎంఆర్), ప్రదీప్ గౌడ్ వర్గాలు ఉన్నాయి. సీటుకోసం ఎవరంతకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీటు రాని పక్షంలో ఒకరికొకరు ఏ మేరకు సహకరిస్తారో చెప్పలేని విచిత్ర పరిస్దితి ఉంది. దీన్ని అధికార టీఆర్ఎస్ అభ్యర్ది అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు.
అవకాశం వస్తే సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరి దేవరకద్ర సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోకూరు పవన్ కుమార్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే జరిగితే అభ్యర్ది విషయంలో ఇక్కడ నలుగురు నేతల మధ్య పోటీ తీవ్రం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. పార్టీ గెలిస్తే సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి నేతల మధ్య సమన్వయం చేసేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపుపై కాంగ్రెస్ మాత్రం ధీమాగా ఉంది.
సొంత పార్టీలోనే ముగ్గురు నేతల పోటీ
ఇక బీజేపీలో చేరిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కుమార్‌రెడ్డికి ఈసారి సానుభూతి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇదే సమయంలో స్వంత పార్టీలో పోటీకోసం మరో ముగ్గురు నేతలు ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు సీటు ఆశిస్తుండటం కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇంకోవైపు గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటున్న డీఎస్పీ కిషన్ ఈసారి దేవరకద్ర నుంచి తప్పకుండా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకోసం వివిధ పార్టీలతో ఆయన టచ్‌లో ఉంటూ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు:
వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు. భూత్పూర్ నుంచి కొత్తకోట మండలం వరకు NH 44 జాతీయ రహదారి, దేవరకద్ర మీదుగా167 జాతీయ రహదారి కలదు.కొత్తకోటలో చేనేత కార్మికులు,బీడీ కార్మికులు ఉన్నారు
పరిశ్రమలు: కొత్తకోట మండలం అప్పరాల దగ్గర కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ కలదు.మూసాపేట మండలంలో ఓ గ్లాస్ పరిశ్రమ ఉంది
అడవులు- దేవరకద్ర మండలంలో అడవి అజిలాపురం, బసవయ్య పల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి.
ఆలయాలు- చిన్నచింతకుంట మండలంలో పేదల తిరుపతిగా పిలిచే శ్రీ కురుమూర్తి స్వామిఆలయం,అడ్డాకుల మండలం కందూరులో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాశీ తర్వాత కల్పవృక్షాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.
పర్యాటకం: 1), కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.2), సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే మొదటిదిగా మరియు ప్రపంచంలో రెండవది ఇక్కడ ప్రత్యేకత మానవ ప్రమేయం లేకుండా వాటర్ వచ్చినప్పుడు గాలి పీడనం (సైఫన్ సిస్టమ్) ద్వారా నీరు బయటికి వస్తుంది. సుదీర్ఘమైన పొడవులో ఊకచెట్టు వాగు ఉంది.