అడవుల అభివృద్ధికి శ్రీకారం
నర్సాపూర్: రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అటవీశాఖ రాష్ర్ట ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన పలువురు అటవీశాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ అడవులలో పర్యటించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, అందుకు అవసరమైన నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు. అడవులను ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలించేందుకే తాను నర్సాపూర్ అడవిలో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అడవుల అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
కాగా అటవీ శాఖ పరిధిలో 1250 చెరువులు,కుంటలు ఉన్నాయని, వాటిలో 20శాతం చెరువులు,కుంటలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఎంపిక చేసిన చెరువులు,కుంటల అభివృద్ధి పనులు వచ్చే మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్రంలోని అటవీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నర్సాపూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సహజసిద్ధమైన అడవుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకే నర్సాపూర్ అడవులను పరిశీలించేందుకు వచ్చానన్నారు.
అడవిలో చాలా మేర పర్యటించామని చెప్పారు. హైదరాబాద్‌కు సమీపానే నర్సాపూర్ ఉండడం చెంతనే అడవి, చెరువుల్ని కల్గి ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేస్తే ప్రశాంత వాతావరణం మరింత పెరుగుతుందన్నారు. నర్సాపూర్‌లో జింకల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉందని మిశ్రా చెప్పారు. ఆయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ బాబురావు, జిల్లా డీఎఫ్ఓ సోనిబాల, సబ్ డీఎఫ్ఓ రాజేందర్‌కుమార్, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ శివ్వయ్య, ఏసీఎఫ్ రేఖాబాను పర్యటించారు.