Deverakonda constituency
-
గువ్వలగుట్ట.. రోగాల పుట్ట
80శాతం మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి పిట్టల్లారాలుతున్న జనం పట్టించుకోని అధికారగణం, పాలకులు గువ్వలగుట్ట... చందంపేట మండలంలోని ఓ కుగ్రామం. దేవరకొండకు60 కిలోమీటర్ల దూరంలో సాగర్ తీర ప్రాంతమది. కూత వేటు దూరంలోనే సాగర్ జలాశయం కన్పిస్తున్నా కనీసం గుక్కెడునీటికి నోచుకోని దుస్థితి. 650 మంది జనాభా ఉన్న ఈ గ్రామాన్ని కొన్నేళ్ళుగా ఓ మహమ్మారి పట్టి పీడిస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఇప్పటికే వందల మంది మృత్యువాతపడ్డారు. గ్రామంలో కిడ్నీ సంబంధితవ్యాధితో బాధపడని ఒక్క వ్యక్తి కూడా కనిపించడంటే అతిశయోక్తి కాదేమో. - దేవరకొండ దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామంలో 80శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీల్లో సుద్దగడ్డలు తయారుకావడం, తరచు కడుపునొప్పితో బాధపడడం, సరిగ్గా లేచి నిలబడి పని చేసుకోలేకపోవడం, మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వందల మంది కిడ్నీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఎవ్వరి నడుముకు చూసినా ఆపరేషన్ గాట్లే కనిపిస్తాయి. ప్రతి ఏటా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కష్టపడి పోగేసిందంతా ఆపరేషన్‌తో పాటు మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలలో సగం రోజులు ఆస్పత్రుల చుట్టే తిరగడం వీరికి పరిపాటిగా మారింది. మృత్యుభేరి అయిదారేళ్ల కాలంలో ఈ గ్రామంలో వందల మంది పిట్టల్లా రాలిపోయారు. అయితే వీరు వయస్సుడిగి చనిపోయిన వారేంకాదు. ఇటీవల కాలంలో చనిపోయిన వారంతా 30 నుంచి 45 సంవత్సరాలలోపే కావడం గమనార్హం. ఇటీవల కాలంలో రమావత్ అమర్‌సింగ్, వడ్త్య బిచ్య, పెద్ద అమర్య, రమావత్ ఢాక్యా, రాజి, మూఢావత్ జాను, సోమ్లానాయక్, మాన్యానాయక్, రమావత్ సోమ్లా, వెంకట్.. ఇలా చాలా మంది కిడ్నీ సంబంధిత రోగాలతో మృత్యువాత పడ్డారు. ఇక ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. సాక్షి ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో గోపి గ్రామానికి చెందిన రమావత్ స్వామి కుమారుడు గోపి. 12 సంవత్సరాల వయస్సున గోపి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతనికి ఒక కిడ్నీ ఇప్పటికే చెడిపోగా మరో కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం గోపి ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. గుక్కెడు నీరు కరువు గువ్వగుట్ట ప్రజలకు కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యంలేదు. సాగర్ జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా మంచినీటిని అందించాలని ఎన్ని సార్లు ప్రజలు అడిగినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గ్రామంలో ఉన్న బోరు వాటర్‌పైనే జనం ఆధారపడ్డారు. ఊళ్లో వేసిన బోరు ద్వారా మంచినీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. అయితే గ్రామంలో ఎక్కువశాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడడానికి మూల కారణమేమిటనే విషయాన్ని తేల్చడానికి అధికారులు ఇంతవరకూ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఎన్నికలప్పుడే.. ఎన్నికలప్పుడు ఓట్లు అడగటానికి మాత్రమే పా లకులు ఈ గ్రామానికి వస్తుంటారు. అయిదారేళ్ల క్రితం వరకు ఈ గ్రామాన్ని పట్టించుకోలే దు. కానీ ఇటీవల పాలకులు ఆ గ్రామంపై దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించారేత ప్ప ఈ సమస్యను మాత్రం తీర్చలేకపోయారు. -
కొండంత అండ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తవిని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాల్వలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర బుధవారం దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమై నల్లమల అటవీ ప్రాంతంలోని గువ్వలగుట్ట వరకు సాగింది. కొండలు.. కోనలు దాటి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి బాధలు విన్నారు. కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. -
థర్మల్ దెబ్బ
దేవరకొండ: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ‘థర్మల్’ దెబ్బ దేవరకొండపైనే పడనుంది. దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌పవర్‌ప్లాంట్‌కు అవసరయ్యే 10 వేల భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములిస్తేనే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అయితే మొదట నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను సేకరిస్తామని భావించినా, ఇప్పుడు జిల్లాయంత్రాంగం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. తాజాగా దేవరకొండ నియోజకవర్గపరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో, జిల్లా అధికారులు అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఆగమేఘాల మీద సర్వే చేశారు. పనిలోపనిగా శుక్రవారం దేవరకొండ రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అటవీశాఖ అధికారులు చందంపేట మండలంలో పర్యటించారు. ప్రభుత్వభూమి..పదివేల ఎకరాలు దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. చందంపేట మండలంలో 3700 ఎకరాలు, దేవరకొండలో 1700 ఎకరాలు, డిండిలో 3032, పీఏపల్లి మండలంలో 988 ఎకరాలు, చింతపల్లిలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించదలుచుకున్న 7500 ఎకరాల్లో 6500 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం నుంచే సేకరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చందంపేట, డిండి మండలాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఈ భూమి ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకోవడానికి అటవీశాఖ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. జనంలో.... గుబులు : గతంలో పీఏపల్లి మండలం పెద్దగట్టు, చందంపేట మండలం చిత్రియాల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. అక్కడ వెలికితీసే యురేనియం నిక్షేపాలను శుద్ధి చేయడం కోసం దేవరకొండ మండలంలోని శేరిపల్లి అనువైందిగా భావించింది. అక్కడున్న 500 ఎకరాల్లో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనియూసీఐఎల్ భావించింది. ఇందు కోసం శేరిపల్లి ప్రాంతంలో సర్వే కూడా నిర్వహించారు. జేత్యతండా సమీపంలో అధికారుల నివాసానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సిందిగా, జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం స్తబ్దుగా ఉన్నప్పటికీ, గతంలో యురేనియం ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇదే క్రమంలో చందంపేట మండలంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు జరుగుతుండగా, నక్కలగండి ప్రాజెక్టు కోసం ముంపునకు గురయ్యే 3వేల ఎకరాలకు భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. అక్కడ కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగా, ముంపు బాధితుల నుంచినిరసన గళం వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ముంపునకు గురైనప్పుడు తెల్దేవర్పల్లిలో ఆవాసాలు కల్పించగా, మళ్లీ అదే ప్రాంతం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతుంది. వారికి ఇంకా ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా చూపించనేలేదు. నూతన భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం వారు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు చందంపేట, డిండి ప్రభుత్వ భూములను ప్రత్యామ్నాయంగా భావించడం..అధికారగణం ఇందుకు సంబంధించిన సర్వేలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో గుబులు మొదలయ్యింది.