అంతా ఆయనే చేశారు.. ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: మొన్నటి వరకు సాగిన మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ను ఏమాత్రం సంప్రదించలేదని తెలిపారు. తాము ఎమ్మెల్యేల కొనుగోలుకు, పార్టీ చీల్చివేతకు పాల్పడలేదని అన్నారు. అజితే తొలుత తమ వద్దకు వచ్చి.. తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఒప్పించినట్లు ఫడ్నవిస్ పేర్కొన్నారు. ఈ తతంగమంతా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు చెప్పే చేస్తున్నానని కూడా అజిత్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే అప్పుడున్న పరిస్థితిల్లో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా శరద్ చక్రం తిప్పారని, అజిత్ డ్రామా వెనుక ఆయన హస్తం ఉందని ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘ఎన్నికల తరువాత అజిత్‌ను మేం సంప్రదించాం అనేది అవాస్తవం. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు అజిత్ మా వద్దకు వచ్చారు. ఆయనతో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రమాణ స్వీకారం కూడా చేశాం. కానీ ఏమైందో ఏమో తెలీదు 24 గంటల్లోనే అజిత్ మాట మార్చారు. తనేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇదంత శరద్ పవార్ అడిన రాజకీయ నాటకంగా తర్వతా మాకు అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సమయంలో కలిసి పనిచేద్ధాం అని శరద్‌ను తొలతు ఆహ్వానించాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనరాలేదు. ఈ భేటీ గురించి శరద్ అయనకు అనుకూలమైన కొన్ని విషయాలను మాత్రమే బహిర్గతం చేశారు. ఆయన చెప్పాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడే నేనే వాటిని బయటపెడతా. శివసేన కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో భేరాలకు దిగింది. మరాఠ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్దం’ అని అన్నారు.