విశ్వాసం లేని వారు పుష్కరాలు ఎలా నిర్వహిస్తారు..
మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి
వన్‌టౌన్ : భక్తి విశ్వాసాలపై ఏమాత్రం నమ్మకం లేని ప్రభుత్వం పుష్కరాలను ఏవిధంగా నిర్వహిస్తుందని మాజీ శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వన్‌టౌన్‌లోని వివిధ ప్రాంతాల్లో కూల్చివేసిన ఆలయాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పురాతనమైన ఆలయాలను ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేస్తున్న అధికారులు, ప్రభుత్వ తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. 86 ఏళ్ల చరిత్ర ఉన్న దాసాంజనేయస్వామి ఆలయాన్ని, రాయల్‌హోటల్ సమీపంలోని గంగానమ్మ గుడిని రాత్రికిరాత్రి తొలగిం చటం అమానుషమన్నారు.
హెచ్‌బీ కాలనీ వద్ద రోడ్డు పక్కన ఉన్న కనకమహాలక్ష్మీ ఆలయాన్ని, పక్కనే జెండాచెట్టును కూల్చటం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రార్థన మందిరాలను కాపాడుకోవాలే తప్పఅరాచకానికి తెగబడితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పార్టీ ఓబీసీ విభాగ ఇన్చార్జి శివకుమార్పట్నాయక్, నేతలు అడ్డూరి శ్రీరామ్, భోగవల్లి గురుదత్, పోతిన శ్రీనివాసరావు, డేరుంగుల రమణ, పిళ్లా శ్రీను పాల్గొన్నారు.