Dharahara Tower
-
'నా కళ్ల ముందే కుప్పకూలిపోయింది'
కాఠ్మండు: శనివారం ఉదయం నేపాల్ రాజధాని కాఠ్మండు నడిబొడ్డున ఉన్న చారిత్రక కట్టడం దర్హారా ప్రాంతం ప్రశాంతంగా ఉంది. నేపాలీలు దీన్ని ఈఫిల్ టవర్గా పిలుచుకుంటారు. ఈ కట్టడం సమీపంలో తపన్ సింగ్ అనే వ్యక్తి బస్ టికెట్ కొనుక్కొనేందుకు క్యూలో నించున్నాడు. అంతలోనే పెనువిపత్తు వచ్చింది. తపన్ కాళ్ల కింద భూమి కంపించింది. తపన్ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దర్హారా టవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తొమ్మిది అంతస్తుల (50.5 మీటర్ల ఎత్తు) ఈ టవర్ నేలమట్టమైంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన దర్బార్ స్క్వేర్.. తన కళ్ల ముందే కూలిపోయిందని తపన్ కన్నీటిపర్యంతమయ్యాడు. 'దర్హారా టవర్ అటుఇటూ ఊగిపోతూ కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. ఏమీ వినిపించలేదు' అని తపన్ చెప్పాడు. ఈ పెను ప్రమాదం నుంచి తపన్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే దర్హారా శిథిలాల కింద 250 మందికిపైగా మంది సమాధి అయ్యారు. రాజరిక నేపాల్‌లో రాణి లలిత త్రిపుర సుందరి ఆదేశాల మేరకు 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్సేన్ తపా ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా ఉంచడానికి ఈ శిఖరం లాంటి నిర్మాణం అప్పట్లో ఉపయుక్తంగా ఉండేది. క్రమేణా ఈ భారీ నిర్మాణం ఖాట్మండు నగరానికే ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. అలాంటి ఈ టవర్ చరిత్రలో కలసిపోయింది. శనివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి కొన్ని సెకెన్ల వ్యవధిలో నేపాల్ మరుభూమిగా మారిపోయింది. దాదాపు 5 వేలమంది మరణించగా, మరో 7 వేలమందికిపైగా గాయపడ్డారు. భూకంపం నేపాలీల జీవితంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. -
ఓవైపు విషాదం...మరోవైపు సెల్ఫీలు
కఠ్మాండు: ఎక్కడికెళ్లినా సెల్ఫీ(స్వీయ చిత్రం)లు క్లిక్ చేసుకోవడం, ఫేస్బుక్, ట్వీటర్ వంటి సైట్లలో పోస్ట్ చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది. ఓవైపు విషాదం చివరికి కఠ్మాండులో భూకంపం వల్ల కుప్పకూలిన చారిత్రక ధారాహర టవర్ వద్ద కూడా ఇప్పుడు సెల్ఫీల గోల మొదలయింది. విషాదమే అయినా.. చారిత్రక సాక్ష్యం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చర్య విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు గూడు చెదిరి, కూడు, గుడ్డతో పాటు గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే నవ్వుతూ సెల్ఫీలు తీసుకోవసం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
కూలిన భీమ్ సేన్ శిఖరం..శిథిలాల కింద 500మంది!
-
కూలిన భీమ్సేన్ శిఖరం..శిథిలాల కింద 500మంది!
ఖాట్మండ్ : ఖాట్మండ్‌లోని చారిత్రక ధరహరా భీమ్సేన్ శిఖరం కూలిపోయింది. ఈ శిఖరం కింద సుమారు 500 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది యత్నిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా 19వ శతాబ్దంలో ఈ శిఖరాన్ని నిర్మించారు. భూకంపం అనంతరం ఆ శిఖరం కూలి... శిథిలాలు మాత్రమే మిగిలాయి. అంచనాలకు అందనంతగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా ప్రాణా, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందిజ కాగా శనివారం ఉదయం 11.42 గంటలకు నేపాల్‌లోని లామ్జంగ్లో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని భరత్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదు అయ్యింది. మరోవైపు నేపాల్ రాజప్రసాదానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రతతో భవనాలు, గృహ సముదాయాలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టం అయ్యాయి. దీంతో నేపాల్ మొత్తం దుమ్ము,ధూళితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన జనాలు ఎక్కడికి వెళ్లాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.