D.Hirehal
-
వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం
డీ.హీరేహాళ్ : మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లోని నీలకంఠేశ్వరస్వామి రథోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారిని వెండి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవాన్ని ప్రారంభించడానికి మేళతాళాలతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గ్రామ ప్రముఖులు దాదు సాబ్, సర్పంచ్ లక్ష్మీదేవి లను ఆహ్వానించారు. అనంతరం రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. శివనామస్మరణతో సాగిన రథోత్సవంలో నందికోళ్లతో చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శింగాడి జగదీష్, బోజరాజ్‌నాయక్, కరడి మల్లికార్జున, సింగాడి మంజునాథ, టీడీపీ నాయకులు మాకాసి వెంకటేశులు, నాగళ్లి రాజు, తిప్పేస్వామి, నరసింహులు తెలిపారు. -
బసవా.. సీటు వదలవా?
- 11 ఏళ్లుగా ఒకేచోట విధులు - నెల కిందట బదిలీ అయినా వెళ్లని వైనం - అధికార పార్టీ అండదండలున్నాయనే ధీమా - రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ హల్చల్ డీ.హీరేహాళ్ : భూముల బదిలీలతో రైతుల మధ్య విభేదాలు సృష్టించడమే కాకుండా ప్రతి పనికీ డబ్బు వసూలు చేస్తూ ప్రజల్లో ఏహ్యభావం పెంచుకున్న ఆ ఆర్ఐ తనను మరోచోటికి బదిలీ చేసినా సీటు వదలడం లేదు. అధికార పార్టీ అండదండలు ఉన్నందున తననెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో దర్జాగా కార్యాలయంలోనే తిరుగుతూ ‘సొంత’ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఓబుళాపురం గ్రామానికి చెందిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) బసవకుమార్ పదకొండేళ్లుగా డి.హీరేహాళ్ మండలంలో విధులు నిర్వర్తించారు. ఈయన వద్దకు పనిపైనా వెళ్లే వారెవరైనా కాసులు ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ముప్పుతిప్పలు పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. భూములను సైతం ఒకరి పేరుపై ఉన్నవి మరొకరి పేరుపై బదలాయించి.. కోర్టుల వరకు వెళ్లేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. బసవకుమార్ గత నెల 12న కలెక్టరేట్‌కు బదిలీ అయ్యాడు. ఈ మేరకు రిలీవ్ చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ వెంకటనారాయణ తెలిపారు. అయితే కార్యాలయం వదలకుండా ప్రతి రోజూ వచ్చి వెళుతున్నాడు. తనకు కావలసిన వారి పనులను పాత తేదీలతో చేసి పెడుతున్నాడు. మా భూములను వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించలేదు పులకుర్తి పొలంలో సర్వేనంబర్ 551లో 4.97 ఎకరాలకు గాను 2.97 ఎకరాలు మాత్రమే నమోదు చేశారు. మరో 2 ఎకరాలు ఎక్కించాలని, వాటికి ఆధారాలు కూడా చూపించాము. అయినా కార్యాలయం చుట్టు తిప్పుకుంటున్నారు. ఆర్ఐ బసవకుమార్ వల్లే మాకు ఈ బాధలు. – పెన్నయ్య, మల్లికేతి భూములనే మార్చేసిన ఘనుడు యాభై ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేశాం. వాటిని రిజిష్టర్ కూడా చేయించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే సాగుచేసుకుంటున్నాం. ఆ భూములను ఒక స్టోర్ డీలర్ పేరుమీద మార్చేసి మమ్మల్ని ఇబ్బందిపాలు చేశారు. కోర్టులో కేసులు వేసి, తిరుగుతున్నాం. ఇలాంటి అధికారులతో రైతులకు ఇబ్బందే. – వన్నూరప్ప, హడగలి -
డి.హీరేహళ్లో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
అనంతపురం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డి.హీరేహళ్లో ఘనస్వాగతం లభించింది. ఏడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డి.హీరేహళ్లో ఆత్మహత్య చేసుకున్న ఈరన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అన్నివిధాల తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అంతకు ముందు దేవగిరి క్రాస్ వద్ద వ్యవసాయకూలీలు వైఎస్ జగన్‌ను కలిశారు. అక్కడ కొద్దిసేపు ఆగి జగన్ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేవగిరిలో నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. నాగులాపురంలో మారన్న, పూలకుర్తిలో రాముడు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.