ద్వైపాక్షిక సహకారానికి ఊతం!
భారత్, బ్రెజిల్‌ల నిర్ణయం
బ్రెజిల్ ప్రెసిడెంట్, భారత్ పీఎంల తొలి భేటీ
నరేంద్ర మోడీకి ఘన స్వాగతం
బ్రసీలియా/ఫోర్టెలెజా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్, బ్రెజిల్ దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో సహకారాన్ని విసృ్తతం చేసుకోవాలని.. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ల మధ్య బుధవారం తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. వీరి సమక్షంలో పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు.. ఈ మూడింటికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్ష భవనంలో భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ పర్యటన కోసమే ప్రత్యేకంగా రానప్పటికీ.. అధ్యక్ష భవనంలో మోడీకి పూర్తి సైనిక మర్యాదలతో స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవాలు జరిగే 2015 నాటికి భద్రతామండలిలో సంస్కరణలను వేగవంతం చేయాలని జీ 4 కూటమి నేతలుగా మోడీ, రౌసెఫ్‌లు డిమాండ్ చేశారు. జీ 20 సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును, సాకర్ వరల్డ్ కప్ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించిన బ్రెజిల్‌ను ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు. ఆరో బ్రిక్స్ సదస్సు చరిత్రాత్మకమైనదని, దీన్ని దిల్మా రౌసెఫ్ అద్భుతంగా నిర్వహించారని మోడీ కొనియాడారు.
స్నేహ బంధాన్ని పటిష్టం చేస్తాం
అణు, రక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, రష్యా నిర్ణయించాయి. నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మంగళవారం రాత్రి 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా, ఇండియా సంబంధాలను బలోపేతం చేసే చర్యలపై చర్చించామని, మా స్నేహాన్ని మరింత వృద్ధి చేసుకున్నామని భేటీ అనంతరం మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మన దేశానికి స్నేహితుడు ఎవరు అని భారత్‌లో చిన్న పిల్లాడిని అడిగినా.. రష్యా అని ఠక్కున చెబుతాడని, ఎందుకంటే పలు సంక్షోభాల్లో భారత్‌కు రష్యా బాసటగా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. విద్యార్థులకు వీసాలు మరింత సులువుగా అందేలా చూడాలన్న మోడీ విజ్ఞప్తిపై పుతిన్ సానుకూలంగా స్పందించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు. భారత పర్యటన సందర్భంగా కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని సందర్శించాలన్న మోడీ ఆహ్వానానికి పుతిన్ సానుకూలంగా స్పందించారన్నారు. కూడంకుళం ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లు రష్యా సహకారంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.