మార్కెట్ మెచ్చిన సంపాదకుడు
పరుష పదజాలం ప్రయోగించకపోయినా, మెత్తగా మాట్లాడినా, రాసినా తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయనీ, వాటి విషయంలో రాజీపడ కూడదనీ విశ్వసించిన నిజాయితీపరుడైన సంపాదకుడు దిలీప్.
జర్నలిజంలో కొత్త పోకడలను ఆకళింపు చేసు కొని పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూనే తనవైన విశ్వాసాలను నిలబెట్టుకోవడానికి ప్రయ త్నించిన పాతతరం సంపాదకులలో శుక్రవారం (నవంబర్ 25) పునెలో తుది శ్వాస విడిచిన దిలీప్ పాడ్గాంవ్కర్ ఒకరు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతా లలో పండితుడూ, హిందుస్థాన్ సాంప్రదాయ సంగీతంలో మేటి, సమాజ హితం కోసం కృషి చేసిన మేధావి... ఇట్లా చాలా విశేషణాలు చెప్పు కోవచ్చు ఆయన గురించి. టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంపాదకుడుగా ఉన్నప్పుడు తాను దేశంలోనే రెండవ అతిముఖ్యమైన హోదాలో ఉన్నానంటూ (మొదటి హోదా ప్రధానిది) సగర్వంగా ప్రకటించు కున్న ఆత్మవిశ్వాసం ఆయనది. ఆయనకంటే ముందు సంపాదక సారథ్యం వహించిన గిరిలాల్ జైన్, అంతకంటే ముందు సారథి శ్యామ్‌లాల్ సంగతి సరేసరి. దేశ రాజకీయాలపైనా, వ్యాపార వాణిజ్యాలపైనా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభావం గణనీయం. అశోక్‌జైన్ చేతి నుంచి పగ్గాలు సమీర్ జైన్ చేతిలోకి మారిన తర్వాత ఆ పత్రిక శరవేగంతో విస్తరించింది.
సమీర్‌జైన్ ఆలోచనావిధానం విపణి ప్రధానం. తన సంపాదకుడికి బాగా రాయడం కంటే కంపెనీ విధానాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో సామర్థ్యం ఎక్కువ ఉండాలని కోరుకునే యజమాని సమీర్‌జైన్. ఒకానొక సందర్భంలో ముగ్గురు హేమాహేమీలు సంపాదకవర్గంలో ఉండేవారు– గౌతమ్అధికారి, దిలీప్‌పాడ్గాంవ్కర్, అరుణ్‌శౌరీ. ఎగ్జిక్యుటివ్ ఎడి టర్గా అరుణ్‌శౌరీని జైన్ కుటుంబం తట్టుకోలేక పోయింది. గిరిలాల్జైన్ స్థానంలో కొత్త సంపాదకు డిని నిర్ణయించే అవకాశం సమీర్జైన్కు వచ్చిన ప్పుడు తన అభిప్రాయాలతో ఏకీభవించే జర్న లిస్టు దిలీప్‌పాడ్గాంవ్కర్ అని భావించి ఆ పదవి అప్పగించారు. యజమాని మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా పత్రికను తీర్చిదిద్దడమే కర్త వ్యంగా భావించినవాడు దిలీప్. అందుకే పూర్తి స్వేచ్ఛను కోరుకునే వినోద్ మెహతా వంటి సంపా దకులకు దిలీప్‌పైన చిన చూపు. దిలీప్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడుగా ఉండగా ముంబయ్‌లో ఇండిపెండెంట్ పత్రికను నెలకొల్పి నడిపించిన వినోద్మెహతాతో సంఘర్షణ తప్పలేదు.
ఆత్య యిక పరిస్థితిలో జర్నలిస్టులు వ్యవహరించిన తీరు పైన భారతీయ జనతా పార్టీ నేత లాల్‌కృష్ణ అద్వానీ వ్యాఖ్యానించిన రీతిలోనే దిలీప్‌పైన వినోద్ చురక వేశాడు. యజమాని వొంగమంటే దిలీప్ నేలపైన పాకాడంటూ ఎద్దేవా చేశాడు. దేశ ద్రోహులకు కొమ్ముకాస్తాడనీ, జిహాదీల తరఫున వాదిస్తాడనీ, నక్సలైట్లను సమర్థిస్తాడనీ, క్రైస్తవ మిషనరీలను వెనకేసుకొని వస్తాడనీ వామపక్ష భావాలున్న దిలీప్ అంటే గిట్టనివారు విమర్శిం చేవారు. వామపక్ష విరోధులు విమర్శించే వ్యక్తిని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే సమీర్‌జైన్ గౌరవించాడంటే దిలీప్లో ఎటూమొగ్గని స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నదని అర్థం చేసుకోవాలి. పరుష పద జాలం ప్రయోగించకపోయినా, మెత్తగా మాట్లా డినా, రాసినా తనకంటూ కొన్ని విలువలు ఉన్నా యనీ, వాటి విషయంలో రాజీపడకూడదనీ విశ్వ సించిన నిజాయితీపరుడైన సంపాదకుడు దిలీప్.
దిలీప్పాడ్గాంవక్కర్ను నేను రెండుసార్లు మాత్రమే కలుసుకున్నాను. మొదటిసారి శ్రీనగర్‌లో. రెండోసారి హైదరాబాద్‌లో. మన్మోహన్ సింగ్ నియమించిన మధ్యవర్తుల సంఘం కశ్మీర్ లోయలో పర్యటించిన సమయంలో నేను కూడా ఆ ప్రాంతం లోనే ఉన్నా. నేనూ, మా సహచరుడు జమీల్ వీధు లలో తిరిగి ప్రజలతో కలిసి నిరాటంకంగా మాట్లా డుతుంటే దిలీప్‌పాడ్గాంవ్కర్, మరో ఇద్దరు డాక్ బంగ్లాలో కూర్చొని ప్రజా ప్రతినిధుల కోసం, సగటు పౌరులకోసం ఎదురు చూసేవారు. సర్కార్ పంపిన మేధావులు కనుక వారి ఎదుట మనసువిప్పి మాట్లా డటానికి కశ్మీరీలు సంకోచించేవారు. శ్రీనగర్ గెస్ట్ హౌస్‌లో కలిసినప్పుడు ‘మీరు నిజాయితీగా ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని సమస్య పరిష్కా రానికి తీసుకోవలసిన చర్యలు సూచించినప్పటికీ వాటిని ప్రభుత్వం అమలు చేస్తుందని నేను అను కోవడం లేదు’ అని అన్నప్పుడు ఆయన చిరునవ్వుతో ‘నాకూ పెద్దగా భ్రమలు లేవు’ అన్నారు.
ఆయన భయపడినట్టే జరిగింది. ఆయన నాయకత్వంలోని త్రిసభ్య సంఘం చేసిన సిఫార్సులను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ, నరేంద్రమోదీ ప్రభుత్వం కానీ అమలు చేయడానికి ప్రయత్నించలేదు. అందుకే కశ్మీర్ రావణకాష్టంలాగా రగులుతూనే ఉంది. 2010లో కశ్మీర్‌లోయలో అల్లర్లు జరిగి వందమందికి పైగా యువకులు సాయుధ పోలీసుల కాల్పులలో మరణించిన సందర్భంలో ప్రజాగ్రహాన్ని చల్లార్చేం దుకు ఒక కమిటీని పంపించారు. అంతేకానీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్న సంకల్పం లేదు. ఈ విషయంలో దిలీప్ పాడ్గాంవ్కర్ కలత చెందారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దృఢమైన విశ్వాసం ఉంచి మెరుగైన సమాజం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన అగ్రశ్రేణి సంపాదకులలో దిలీప్‌పాడ్గాంవ్కర్ ఒకరు.
-కె. రామచంద్రమూర్తి