వీళ్లనూ తిప్పి పంపేవారా?
‘అమెరికా ఉత్పత్తులనే కొనండి, ఆమెరికా జాతీయులకే ఉద్యోగాలివ్వండి’ అనే తన ఎన్నికల నినాదాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల జారీ విధానంలో కీలకమార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్–1బీ వీసా పొందడం కఠినం కానుంది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం శాశ్వత నివాసానికి అర్హత కల్పించే ‘గ్రీన్‌కార్డు’ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిన ఉద్యోగులు స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలైతే అయిదు నుంచి ఏడున్నర లక్షల మంది భారత ఉద్యోగులపై పెనుప్రభావం పడుతుంది.
అయితే.. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక అమెరికన్ కంపెనీలకు సీఈఓలుగా, అధిపతులుగా ఉన్న భారతీయులు గతంలో హెచ్ –1బీ వీసాలపై అక్కడకు వెళ్లిన వారే. ఒకవేళ ఇప్పుడు ›ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన గతంలోనే అమలై ఉంటే వీరంతా ప్రసిద్ధ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉండేవారా అన్న వాదన ముందుకొస్తోంది. గతంలో సరళమైన వీసా విధానం కారణంగానే పలువురు భారతీయులు ప్రస్తుతం ఆయా కంపెనీల్లో కార్పొరేట్ లీడర్లుగా ఉన్నారు. వీరంతా అమెరికా ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడి, ఆ దేశానికే అధిక లాభం చేకూర్చారు. వలసదారుల దేశంగా పిలిచే అమెరికాలో 20వ దశాబ్దం నుంచి వీసాలు, స్థిరనివాసం విషయంలో కఠిన నిబంధనలను సడలించారు. ఈ చర్యల ఫలితంగా అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించగలిగారు.
భారత్ నుంచి అమెరికా వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడిన కొందరు ప్రముఖులు
సత్యా నాదెళ్ల, హైదరాబాద్‌లో జననం.
హోదా : సీఈఓ, మైక్రోసాఫ్ట్
చదువు : మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బీఈ, అమెరికాలోని విస్కాన్సిన్–మిల్ఔ – ఎమ్మెస్, షికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ఎంబీఏ
సుందర్ పిచాయ్, తమిళనాడులో పుట్టారు.
హోదా : సీఈఓ, గూగుల్ :
చదువు : ఐఐటీ ఖరగ్‌పూర్–బీటెక్, స్టాన్‌ఫర్డ్–ఎమ్మెస్, వార్టాన్–ఎంబీఏ
ఇంద్రానూయి, చెన్నైలో జన్మించారు
హోదా : సీఈఓ, పెప్సీకో :
అనుభవం : 1994లో ఆ సంస్థలో చేరిక. కొన్నేళ్లుగా సీఈఓగా బాధ్యతలు.. 2017లో వ్యాపార,వాణిజ్యాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో ద్వితీయస్థానం
శంతను నారాయణ్, హైదరాబాద్‌లో పుట్టారు
హోదా : సీఈఓ, అడోబ్
చదువు : ఉస్మానియా విశ్వవిద్యాలయం–బీఎస్సీ, బెర్క్లే కాలిఫోర్నియా వర్శిటీ–ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ వర్శిటీ–ఎమ్మెస్
అజయ్‌పాల్‌సింగ్ బాంగా
హోదా : ప్రెసిడెంట్, సీఈఓ, మాస్టర్‌కార్డ్
చదువు : అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ
జార్జి కురియన్, కేరళలో జన్మించారు
హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, నెట్‌యాప్
చదువు : ఐఐటీ మద్రాస్‌లో కొంతకాలం ఇంజనీరింగ్ అమెరికాలోని ప్రిన్స్టన్ (న్యూజెర్సీలోని) యూనివర్శిటీలో డిగ్రీ,. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ–ఎంబీఏ
దినేష్ పాలివాల్, ఉత్తరప్రదేశ్‌లో జననం
హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, హర్మన్ ఇంటర్మేషనల్
చదువు : ఐఐటీ రూర్కీ–బీటెక్, వయామి వర్సిటీ–ఎమ్మెస్, ఎంబీఏ
సంజయ్ ఝా
హోదా : సీఈఓ, గ్లోబల్ ఫౌండ్రీస్
అనుభవం : 2014లో ఈ బాధ్యతలు చేపట్టడానికి పూర్వం మోటరోలా మొబిలిటి సీఈఓగా, క్వాల్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. 2008లో ఆయన మోటరోలా కో(సహ) సీఈఓగా చేరారు.
అజిత్ జైన్, ఒడిశాలో పుట్టారు
చదువు : ఐఐటీ, హార్వర్డ్ల నుంచి ఉన్నతవిద్యాభ్యాసం
అనుభవం :బెర్క్‌షైర్ హాథ్‌వేలో వారెన్ బఫెట్ వారసుడిగా నియమితులయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్