వయసులో డైనోసార్స్కంటే చిన్న
వాషింగ్టన్: శనిగ్రహానికి చెందిన పలు ఉపగ్రహాలు కేవలం వంద మిలియన్ ఏళ్ల కిందటే ఆవిర్భవించి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. డైనోసార్ యుగం తరువాత ఇవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉపగ్రహాల కక్ష్యలు తరచూ మారుతుంటాయి. దీని ఆధారంగా కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఉపయోగించి శని గ్రహ అంతర ఉపగ్రహాల చరిత్రను పరిశీలించినట్లు ‘సెర్చ్ ఫర్ ఎక్స్ట్రాటెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్’(ఎస్ఈటీఐ)కు చెందిన పరిశోధకులు మతిజా కుక్ తెలిపారు.
శని ఉపగ్రహాలు ఇటీవల కాలంలోనే ఏర్పడి నట్లు పరిశోధనలో తాము గుర్తించినట్లు కుక్ చెప్పారు. అయితే ఇవి ఎన్నేళ్ల కిందట ఆవిర్భవించాయో తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన కాసిని వ్యోమనౌక అందించిన సమాచారాన్ని వీరు అధ్యయనం చేశారు. ఇందులో శనిగ్రహానికి చెందిన పలు ఉపగ్రహాలు క్రెటేషియస్ పీరియడ్(డైనోసార్ యుగం) తర్వాతే ఏర్పడినట్లు గుర్తించామని వారు తెలిపారు.