శునకానికి గౌరవ డిప్లొమా
మాస్టార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఉత్తీర్ణులైతే తప్ప డిగ్రీ పట్టాలు చేతికి రావు. అలాంటిది ఇవేవీ చేయకుండానే ఓ శునకం ఆక్యుపేషనల్ థెరపీ డిప్లొమా పట్టాను అందుకుంది. ఆ సంగతేంటో ఓసారి చదవండి..
న్యూయార్క్‌లోని క్లార్క్సన్ యూనివర్సిటీ ఓ శునకానికి గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది. అయితే ఈ శునకానికి ఈ గౌరవం దక్కడం వెనుక బ్రిటనీ హాలీ అనే అమ్మాయి కృషి ఎంతో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చక్రాల కుర్చీలో కనిపిస్తున్న అమ్మాయే బ్రిటనీ. క్లార్క్సన్ యూనివర్సిటీ నుంచి ఇటీవలే సైకాలజీలో ఆక్యుపేషనల్ థెరపీ స్పెషల్ సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ అందుకుంది. అయితే ఈ థెరపీలో ఆమెకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్న గ్రిఫిన్ అనే శునకానికి కూడా డిప్లొమా ఇవ్వాల్సిందిగా బ్రిటనీ సిఫారసు చేసింది. దీంతో గ్రిఫిన్ శక్తిసామర్థ్యాలు పరీక్షించిన యూనివర్సిటీ నిర్వాహకులు అందుకు అంగీకరించడమే కాకుండా డిప్లొమా అందజేశారు. ఈ విషయమై బ్రిటనీ మాట్లాడుతూ.. ‘నేనేదేదీ నేర్చుకున్నానో గ్రిఫిన్ కూడా అవన్నీ నేర్చుకుంది. అందుకే దానిపేరు నేనే సిఫారసు చేశా. యూనివర్సిటీ పాలకవర్గం పెట్టిన పరీక్షలో గ్రిఫిన్ అసాధారణమైన ప్రజ్ఞ చూపింద’ని చెప్పింది.
గ్రిఫిన్ ఏం చేస్తుందంటే..
నార్త్ కరోలినాలోని విల్సన్‌కు చెందిన బ్రిటనీ చక్రాల కుర్చీ లేనిదే ఎటూ కదల్లేదు. కండరాల వ్యాధితో బాధపడుతున్న ఆమె వెంట నిరంతరం ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఆ లోటును గ్రిఫిన్ తీరుస్తోంది. అంతేకాదు సైకాలజీ పేషంట్లకు సేవచేయడంలో బ్రిటనీకి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. వెస్ట్ వర్జీనియా జైళ్లల్లో పాస్4 ప్రిజన్ ప్రోగ్రామ్ ద్వారా ఆమె ఆ కుక్కను తెచ్చుకుంది. ఖైదీలు శిక్షణ ఇచ్చిన శునకం కావడంతో బ్రిటనీ చెప్పిన పనులన్నీ చకచకా చేసేది.