dis qualify
-
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయండి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని, అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. -
ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు కాంగ్రెస్ కర్ణాటక విభాగం నివేదించింది. -
రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలి నుంచి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపిస్తూ.. శాసనమండలి చైర్మన్ అతన్ని అనర్హుడినిగా పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎన్నికయిన తనపై చట్ట విరుద్ధంగా వేటు వేశారని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని తీర్పును వెలువరించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రాములు నాయక్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ కుర్షిద్ రాములు తరఫున ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. దీంతో ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి, మండలి ఛైర్మన్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. -
'ఆ 8మంది ఎమ్మెల్యేలపై వేటు వేయండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వారు ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి, డేవిడ్ రాజు, జయరాములు, మణిగాంధీ, కలమట వెంకటరమణ తదితరులు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు.