
సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలి నుంచి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపిస్తూ.. శాసనమండలి చైర్మన్ అతన్ని అనర్హుడినిగా పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎన్నికయిన తనపై చట్ట విరుద్ధంగా వేటు వేశారని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని తీర్పును వెలువరించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం రాములు నాయక్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ కుర్షిద్ రాములు తరఫున ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. దీంతో ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి, మండలి ఛైర్మన్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది.