'ఆ 8మంది ఎమ్మెల్యేలపై వేటు వేయండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వారు ఈ సందర్భంగా స్పీకర్ను కోరారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి, డేవిడ్ రాజు, జయరాములు, మణిగాంధీ, కలమట వెంకటరమణ తదితరులు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు.