డిష్మన్- టీమ్‌లీజ్- జూబిలెంట్.. బోర్లా
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు చొప్పున క్షీణించాయి. కాగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలో పనితీరు నిరాశపరచడంతో డిష్మన్ కార్బొజెన్ కౌంటర్ సైతం బోర్లా పడింది. మరోపక్క స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో మరో 36 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో టీమ్‌లీజ్ సర్వీసెస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ మూడు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..
టీమ్‌లీజ్ సర్వీసెస్
అదనంగా 36.17 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో వాటాను 76.37 శాతానికి పెంచుకున్నట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. దీంతో స్కూల్‌గురును అనుబంధ సంస్థగా మార్చుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌లీజ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం దిగజారి రూ. 2,140ను తాకింది. ప్రస్తుతం 5.2 శాతం నష్టంతో రూ. 2172 దిగువన ట్రేడవుతోంది.
జూబిలెంట్ లైఫ్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైన నేపథ్యంలో మూడో రోజూ జూబిలెంట్ లైఫ్ కౌంటర్ బోర్లా పడింది. దీనికితోడు సీఎఫ్‌వో అలోక్ వైష్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. రాజీనామాను ఆమోదించినట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో జూబిలెంట్ లైఫ్ షేరు ప్రస్తుతం 5.2 శాతం క్షీణించి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 686 వరకూ జారింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 17 శాతం నీరసించడం గమనార్హం!
డిష్మన్ కార్బొజెన్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డిష్మన్ కార్బొజెన్ ఎమిక్స్ రూ. 21.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 34.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం క్షీణించి రూ. 474 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో డిష్మన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 171 దిగువన ఫ్రీజయ్యింది.