‘రొయ్య’ చిచ్చు
బొబ్బర్లంక (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : గోదావరిలో రొయ్య సీడ్ సేకరణలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బొబ్బర్లంక జల్లివారిపేటకు చెందిన దళితులు, ధవళేశ్వరానికి చెందిన మత్స్యకారుల మధ్య వివాదం నేపథ్యంలో పిచ్చుకలంక వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
గోదావరికి ఒకవైపున ఉంటున్న ధవళేశ్వరానికి చెందిన మత్స్యకారులు రొయ్యసీడ్ సేకరించడానికి అధికారులు అనుమతి మంజూరు చేశారు. ఈ క్రమంలో వారు గోదావరిలో పిచ్చుకలంక వద్ద రొయ్యసీడ్ సేకరించడానికి ఉద్యుక్తులయ్యారు. ఎప్పటినుంచో తామే రొయ్య సీడ్ సేకరించి, జీవనోపాధి పొందుతున్నామని గో దావరికి మరోవైపు ఉన్న ఆత్రేయపురం మం డలం బొబ్బర్లంకకు చెందిన జల్లి వారిపేట దళి తులు అభ్యంతరం తెలిపారు. మత్స్యకార వర్గానికి చెందిన ఓ జిల్లా ఉన్నతాధికారి తమకు అన్యాయం చేసి, ధవళేశ్వరానికి చెందిన మత్స్యకారులకు అనుమతి మంజూరు చేశారని ఆరోపించారు.
ఈ మేరకు గతంలో జిల్లా గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కూ ఫిర్యాదు చేశారు. తమ కులవృత్తికి అనుగుణంగానే అధికారులు రొయ్యసీడ్ సేకరణకు అనుమతి ఇచ్చారని ధవళేశ్వరం బోట్మెన్ అండ్ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు కె.ఇమ్మానియల్, ఇతర మత్స్యకారులు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి, ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఎస్సైలు కేవీఎస్ సత్యనారాయణ, గోవిందరా జు, బాలాజీ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు సంఘటన స్థలాన్ని మోహరించారు. బొబ్బర్లం కకు చెందిన దళితులు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దళితు లు రొయ్య సీడ్ సేకరించే ప్రాంతానికి చట్టబద్ధ త కల్పించాలని, మత్స్య శాఖ లీజు ఉత్వర్తులు సవరించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కొండా దుర్గారా వు మాట్లాడుతూ రొయ్య సీడ్ సేకరణతో జీవనోపా ధి పొందుతున్న దళితుల కు న్యాయం చేయాలన్నా రు.
బొబ్బర్లంకలో వ్యవసాయ భూములు లేనందున ఇక్కడి దళితులు చేపలవేట, రొయ్యసీడ్ సేకరణపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ధవళేశ్వరం ఆర్మ్ గేట్ నం.1 నుంచి నం.40 వరకు సీడ్ సేకరిస్తున్న ధవళేశ్వ రం బోట్మెన్ అండ్ ఫిషర్మెన్ వారు, 41 నుం చి 70 గేట్ వరకు జల్లివారిపేట దళితులకు లీజు హక్కులు కల్పిస్తే వివాదం పరిష్కారమయ్యేదన్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేదని, మత్స్య శాఖ తాజా ఉత్తర్వులు ఘర్షణలకు ఆస్కారం కల్పించాయని ఆరోపించారు. అమలాపురం ఆర్డీఓ సీహెచ్ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డి అక్క డకు చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 8న రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం పిచ్చుకలంక వద్ద పోలీ సు పికెట్ ఏర్పాటుచేశారు. తహశీల్దార్ వి.సత్యవతి, ఫిషరీస్ అధికారి సీహెచ్ రాంబాబు, ఆర్ఐ ప్రసాద్ పరిస్థితిని సమీక్షించారు.
కాటన్ బ్యారేజ్‌పై పోలీసుల మోహరింపు
ధవళేశ్వరం : రొయ్యసీడ్ వివాదం నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై పోలీసులు మోహరించారు. డీఎస్పీ ఉమాపతివర్మ ఆధ్వర్యంలో సీఐలు అరిగెల ప్రసాద్‌కుమార్, కందుల వరప్రసాద్, అంబికా ప్రసాద్ తమ సిబ్బందితో బ్యారేజ్‌పై బందోబస్తు నిర్వహించారు.