ఏకగ్రీవం దిశగా డీపీసీ
సాక్షి, సంగారెడ్డి: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా మంత్రి హరీష్రావు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. డీపీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు వీలుగా హరీష్రావు కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. డీపీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్లు స్వీకరించారు. నాలుగు అర్బన్ స్థానాలకు గాను మొత్తం 10 నామినేషన్లు వచ్చాయి. బీసీ మహిళ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఆ స్థానం ఏకగ్రీవం కానుంది.
ఇక 20 రూరల్ స్థానాలకు గాను మొత్తం 42 నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న జెడ్పీటీసీలు 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లును సోమవారం పరిశీలించి అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
మంత్రి మంత్రాంగం
జిల్లా ప్రణాళిక కమిటీని ఏకగ్రీవం చే సేందుకు అధికార పార్టీ యోచిస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా మంత్రి హరీష్రావు జిల్లా ప్రణాళిక కమిటీని ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. శుక్రవారం సంగారెడ్డికి వచ్చిన ఆయన ఇదే విషయమై జెడ్పీ చైర్పర్సన్ రా జమణి, ఇతర నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ప్రాతినిథ్యం ఉన్న బీజేపీ, ఎంఐఎం పార్టీలతోనూ మంత్రి హరీష్రావు మంతనాలు జరిపి డీపీసీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
డీపీసీలో మెజార్టీ సభ్యుల సంఖ్య టీఆర్ఎస్ వారు ఉండేలా జాగ్రత్త వహించటంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు స్థానం కల్పించామన్న సందేశం వెళ్లేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే డీపీసీలో కాంగ్రెస్, టీడీపీ నుంచి సభ్యులు ఉండేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్కు జెడ్పీటీసీలు ఉన్నారు. దీంతో నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఆరుగురు జెడ్పీటీసీలకు డీపీసీలో స్థానం ఇవ్వాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం 8 స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల నుంచి ప్రాతినిథ్యం వహించే కౌన్సిలర్ స్థానాల ఏకగ్రీవం పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.